బెంగాల్ లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య

బెంగాల్ లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య
కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైద్యకళాశాలలో శవమై తేలిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైనీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయం వెలుగులోకి వచ్చాయని పోలీస్ ఉన్నతాధికారి శనివారం కోల్‌కతాలో వెల్లడించారు. లైంగిక దాడి చేసి అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసినట్లు నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టమైందని తెలిపారు. 
 
అలాగే ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ నుంచి తీవ్రంగా రక్త స్రావమైందని తెలిపారు. ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఆస్పత్రితో సంబంధం లేని ఆ వక్తి, ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో స్వేచ్ఛగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. అతడి ప్రవర్తన అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు నేరంలో అతడు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుమానానిస్తున్నారు. .
 
ఈ ఘటనకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్‌ డాక్టర్లు శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రమేయమున్న వారిని శిక్షించాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేశారు.  పశ్చిమబెంగాల్‌లోని ఆర్‌జి కార్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో రెండవ సంవత్సరం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ విద్యార్థి (31)పై ఈ దారుణం జరిగింది.
ఆమె గురువారం రాత్రి ఆలస్యంగా భోజనం చేసి, చదువుకునేందుకు మూడవ అంతస్తులో సెమినార్‌ హాల్‌లోకి వెళ్లింది. శుక్రవారం ఉదయానికల్లా ఆమె మృతి చెందింది.  తన తోటి విద్యార్థులు ఆమె మృతదేహాన్ని చూసే సమయానికి ఆమె కళ్లు, నోటి నుంచి రక్తం కారుతుంది. ముఖం, పెదవులు, మెడ, కడుపు ప్రైవేటు భాగాల్లో గాయాలయ్యాయి. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఆమె లైంగిక వేధింపులకు గురైందని తేలింది. 
 
ఈ ఘటనపై కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ కుమార్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశాము. ఓ వ్యక్తిని అరెస్టు చేశాము. ముగ్గురు వైద్యులతో కూడిన బోర్డు పోస్టుమార్టం నిర్వహించింది. ఈ మొత్తం ప్రక్రియ వీడియోగ్రఫీ చేశారు’ అని చెప్పారు. 
 
ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు వైద్యులను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ఇక వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి తెల్లవారుజామున 3.00 గంటల నుంచి 6 గంటల మధ్య చోటు చేసుకుందన్నారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలి మృతి కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఉదంతంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందిస్తూ అవసరమైతే హంతకుడికి ఉరి శిక్ష వేయించడానికి కూడా తమ ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. దీన్ని ఓ దురదృష్టకర ఘటనగా అభిమర్ణించిన ఆమె, బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితులపై తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.

ఆందోళన చేస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే కచ్చితంగా ఇతర లాఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీని ఆశ్రయించొచ్చని మమత సూచించారు. ఏ రకంగా అయినా సరే హంతకుడికి కఠిన శిక్షపడాలని ఆమె స్పష్టం చేశారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లు పేషంట్లకు చికిత్సను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో నిర్వహించాలని అధికారులకు సూచించారు.  మరోవైపు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బిజెపి ప్రతినిధి అగ్నిమిత్ర పౌల్‌ డిమాండ్ చేశారు.