రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్ళిన ఉక్రెయిన్ దళాలు

రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్ళిన ఉక్రెయిన్ దళాలు
గత రెండేండ్లకు పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో సీన్‌ రివర్స్‌ అయింది. మొదట సైనిక చర్య పేరుతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌ భూభాగంలోకి చొరబడి, విధ్వంసం సృష్టించగా ఇప్పుడు ఉక్రెయిన్‌ బలగాలు రష్యా భూభాగంలోకి 30 కిలోమీటర్ల మేర వెళ్లిపోవడం కీలకంగా మారింది. శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లడమే కాకుండా ఆర్టిలరీ, డ్రోన్‌ దాడులను కూడా ఉక్రెయిన్‌ దళాలు చేపట్టాయి.
 
రష్యా భూభాగంలోకి వెళ్లిన ఉక్రెయిన్‌ బలగాల సంఖ్య వెయ్యికి పైగా ఉండే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. వీరంతా ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ ఒబ్లాస్ట్‌ రీజియన్‌ నుంచి వెళ్లి, రష్యాలోని కుర్సు ఒబ్లాస్ట్‌ను తమ అధీనంలోకి తీసుకొన్నట్టు తెలుస్తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో కుర్సు రీజియన్‌లో రష్యా ఫెడరల్‌ స్థాయి ఎమర్జెన్సీని విధించింది.

ఉక్రెయిన్‌ బలగాలను మరింత ముందుకు వెళ్లనీయకుండా అక్కడకు పెద్దయెత్తున సైనికుల మోహరింపు చేపట్టింది. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని సుజ్దా పశ్చిమ శివార్లలో రెండు దేశాల మధ్య సైనికుల మధ్య యుద్ధం జరుగుతున్నదని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.  కుర్సు నుంచి 3 వేల మందికి వరకు ఇతర ప్రాంతాలకు తరలించినట్టు గవర్నర్‌ అలెక్సీ స్మిర్‌నోవ్‌ తెలిపారు. తమ ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు రాకెట్‌ లాంచర్లు, ఆర్టిలరీ, ట్యాంకులు, హెవీ ట్రక్కులు వంటి ఆయుధాలను పంపిస్తున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఉక్రెయిన్‌ చేపట్టిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఉద్దేశంపై అస్పష్టత నెలకొన్నది. అయితే యుద్ధం ప్రారంభమైన 2022, ఫిబ్రవరి నాటి నుంచి ఉక్రెయిన్‌ తాజాగా చేపట్టిన ఈ ఆపరేషన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పెద్ద సవాల్‌గా మారిందనే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే తాజా పరిణామంపై ఉక్రెయిన్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. దీని ద్వారా యుద్ధం నెమ్మదిగా రష్యా భూభాగంలోకి ప్రవేశించిందని ఆ దేశం గ్రహిస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మైహైలో పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ ఏమీ చెప్పనప్పటికీ, దానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నట్టు కనిపిస్తున్నదని భావిస్తున్నారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలతో ఉక్రెయిన్‌ బలగాలు రష్యా భూభాగంలోకి 35 కిలోమీటర్ల వరకు వెళ్లాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టడీ ఆఫ్‌ వార్‌(ఐఎస్‌డబ్ల్యూ) అనే సంస్థ పేర్కొన్నది.

మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో తూర్పు ఉక్రెయిన్‌లోని కొస్టియాంటినివ్కాలో ఓ మాల్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా, 44 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు వెల్లడించారు. రద్దీ ప్రాంతంపై రష్యా మరోసారి దాడికి పాల్పడిందని డొనెట్స్‌ రీజనల్‌ హెడ్‌ ఫిలాస్కిన్‌ అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే పట్టణంలోని మార్కెట్‌పై రష్యా జరిపిన దాడిలో 17 మంది మరణించారు.