బంగ్లాదేశ్‌లో హిందు ఆలయాలు ధ్వంసం

బంగ్లాదేశ్‌లో హిందు ఆలయాలు ధ్వంసం

బంగ్లాదేశ్‌లో ప్రధాని షేఖ్ హసీనా ఉద్వాసన దరిమిలా సాగుతున్న హింసాత్మక సంఘటనల్లో పలు హిందు ఆలయాల, ఇళ్లు, వాణిజ్య సంస్థలను ధ్వంసం చేశారని, మహిళలపై దౌర్జనం జరిగిందని, అవామీ లీగ్‌తో అనుబంధం ఉన్న కనీసం ఇద్దరు హిందు నేతలను హత్య చేశారని హిందు సమాజం నేతలు మంగళవారం తెలియజేశారు.

‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం ఘటనల సమాచారం కొన్నిటిని సంకలనం చేశాం. అవి హిందువులు, ఇతర మైనారిటీ సమాజాలను ఆందోళనపరుస్తున్నాయి’ అని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ నేత కాజోల్ దేబ్‌నాథ్ ఢాకాలో ఆ గ్రూప్ సమావేశం తరువాత చెప్పారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, హసీనా అవామీ లీగ్ (ఎఎల్)కు చెందిన ఇద్దరు హిందు నేతలను వాయవ్య సిరాజ్‌గంజ్, రంగ్‌పూర్‌లలో హత్య చేశారని దేబ్‌నాథ్ తెలిపారు.

కౌన్సిల్ మరింత సమాచారాన్ని సేకరిస్తున్నదని దేబ్‌నాథ్ చెప్పారు.  హసీనా ప్రభుత్వ పతనం తరువాత వేగంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దుండగులు ‘షాపులు, ఆలయాలు, ఇళ్లు ధ్వంసం చేశారు, హిందు మహిళలపై దౌర్జన్యం చేశారు, అనేక మంది దౌర్జన్య సంఘటనలలో గాయపడ్డారు’ అని దేబ్‌నాథ్ వివరించారు. 

‘పరిస్థితి బీభత్సంగా ఉంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి’ అని యూనిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రాణా దాస్‌గుప్తా అంతకుముందు ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘మైనారిటీలకు భద్రత లభించేలా చూడాలని, దాడి బాధ్యులను వెంటనే నిర్బంధించాలని సైన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

కాగా, ఖుల్నా డివిజన్‌లోని మెహర్‌పూర్‌లో ఉన్న ఇస్కాన్‌ టెంపుల్‌పై  దాడిచేశారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. విగ్రహాలను పగులగొట్టారు. ఆ ప్రతిమలను కాల్చివేశారు.

హసీనా రాజీనామా చేసి దేశం వీడారన్న వార్త తెలియగానే వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. రాజధాని ఢాకాలోని పీఎం అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి.. అక్కడి వస్తువులు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. చేతికందినకాటికి దోచుకెళ్లారు. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వంలోని మంత్రులు, పార్టీ ఎంపీల నివాసాలు, వ్యాపార సంస్థలపై కూడా నిరసన కారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 109 మంది మరణించారని స్థానిక మీడియా పేర్కొంది.

దేశవ్యాప్తంగా జులై 16 నుంచి నిన్నటి వరకూ 21 రోజుల్లో జరిగిన అల్లర్లలో మొత్తం మరణాల సంఖ్య 440కి చేరినట్లు వెల్లడించింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య దాదాపు 37 మృతదేహాలను ఢాకా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘర్షణల్లో బుల్లెట్‌ సహా వివిధ గాయాలతో సుమారు 500 మంది ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపింది.