బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా.. సైన్యం చేతిలో పాలన

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా.. సైన్యం చేతిలో పాలన
 
* దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా
 
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ తగలబడిపోతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ మేరకు ప్రధానమంత్రి సీనియర్ సలహాదారు ఒకరు మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం బంగ్లాలో కర్ఫూ కొనసాగుతోంది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం సిద్ధమైంది. శాంతిభద్రతలు మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆర్మీ చీఫ్ ప్రకటించారు. మరోవైపు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైన్యం మొహరించింది.
 
నిరసనకారులు ఢాకాలోని తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బంగ్లాదేశ్ సైనిక హెలికాప్టర్‌లో తన అధికారిక నివాసం ‘బంగాభబన్’ నుంచి బయలుదేరి వెళ్లారు. చెల్లెలు షేక్ రెహానాతో కలిసి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లారని బంగ్లాదేశ్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 
 
కాగా షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి. గత ఐదు దశాబ్దాలలో కనివిని ఎరుగని హింసాయుత సంఘటనలు చోటుచేసుకోవడం, గత మూడు రోజులలోనే సుమారు 300 మంది చనిపోవడం, ఆమె చర్చలకు ఆహ్వానించినా ఉద్యమకారులు తిరస్కరించి ఆమె రాజీనామాకు పట్టుబట్టడంతో ఆమెకు మార్గం లేకపోయిన్నట్లు భావిస్తున్నారు.
 
ఆదివారం మొదలైన ఈ అల్లర్లు సోమవారం రెండో రోజు కూడా కొనసాగాయి. ఇవాళ వేలాది మంది నిరసనకారులు రాజధాని ఢాకాలో విధ్వంసం సృష్టించారు. జాతిపిత షేక్‌ ముజిబుర్‌ విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఇక ఢాకాలోని పీఎం అధికారిక నివాసం గణభబన్‌ను ముట్టడించారు. 
 
కొందరు నిరసనకారులు పీఎం నివాసంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా, ఆమె సోదరి షేక్‌ రెహానా బంగ్లాను వీడి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అల్లర్లలో ఇప్పటివరకు 300 మందికిపైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా నివేదించింది.
 
బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారనే కథనాల నేపథ్యంలో ఆ దేశ ఆర్మీ ఛీఫ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు తెలిపారు. దేశంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పార్టీలతో చర్చించి ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తామని వివరించారు.

ప‌శ్చిమ బెంగాల్ దిశ‌గా ఆమె వెళ్లిన‌ట్లు ఢాకా ట్రిబ్యూన్ త‌న రిపోర్టులో పేర్కొన్న‌ది. కానీ బంగ్లాదేశ్ బీబీసీ మాత్రం ఆమె అగ‌ర్త‌లా వెళ్తున్న‌ట్లు చెప్పింది. బంగ‌భ‌బ‌న్ నుంచి ఆమె మ‌ధ్యాహ్నం 2.30 నిమిషాల‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. షేక్ హ‌సీనా, షేక్ రెహానా.. చాలా సుర‌క్షిత‌మైన ప్రాంతానికి చేరుకున్న‌ట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.

1971 యుద్ధంలో మ‌ర‌ణించిన సైనిక కుటుంబాల పిల్ల‌ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు 30 శాతం కోటాను కేటాయిస్తూ షేక్ హ‌సీనా స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప్ర‌జ‌లు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆదివారం జ‌రిగిన హింస‌లో సుమారు వందల మంది మ‌ర‌ణించారు.

కాగా, గడిచిన 15 ఏళ్లుగా బంగ్లాదేశ్‌ను పాలిస్తున్న షేక్‌ హసీనాకు తాజా ఆందోళనలు సవాలుగా మారాయి. రాజధాని రోడ్లపై నిరసనకారులు ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు. రాజధానిని జిల్లాలకు కలిపే మార్గాలన్నింటిని మూసేశారు. సిరాజ్‌ గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఆందోళనకారుల దాడిలో ఏకంగా 13 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు.