కేరళలో బెయిలీ బ్రిడ్జిల నిర్మాణంలో మహిళా సైనికాధికారి

కేరళలో బెయిలీ బ్రిడ్జిల నిర్మాణంలో మహిళా సైనికాధికారి

* 308కి చేరిన వయనాడ్‌ మృతుల సంఖ్య

చౌరల్మాల, ముండక్కైలను కలుపుతూ సైన్యం నిర్మించిన బెయిలీ బ్రిడ్జి నిర్మాణానికి నాయకత్వం వహించిన ఇంజనీరింగ్ బృందంలో మేజర్ సీతా షెల్కే ఏకైక మహిళా అధికారి. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. గతంలోనూ ఇలాంటి నిర్మాణ పనులు చేసిన అనుభవజ్ఞుడైన అధికారి.  ఆర్మీ రెస్క్యూ ఫోర్స్ కేరళ, కర్ణాటక సబ్ ఏరియాస్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ) మేజర్ జనరల్ వీటీ మాథ్యూ నేతృత్వంలోని బృందం బెంగళూరు నుంచి చురల్మాల చేరుకుంది. అలప్పుజకు చెందిన మేజర్ అనీష్ మోహన్ వంతెన నిర్మాణాన్ని పర్యవేక్షించారు. 

కొండచరియలు విరిగిపడటంతో ముండక్కై వద్ద వంతెన కూలిపోయి ముండక్కై, చౌరల్మాల మధ్య కనెక్షన్ తెగిపోయింది. దీంతో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు. బెయిలీ బ్రిడ్జి రాకతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి.  ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ (ఎంఈజీ) ఈ వంతెనను నిర్మించింది. సైన్యానికి సాంకేతిక సహాయం అందించే విభాగం ఇది.

వంతెనల నిర్మాణం, సైన్యానికి మార్గం సుగమం చేయడం, మందుపాతరలను గుర్తించడం, నిర్వీర్యం చేయడం వంటి పనులను ఎంఈజీ చేస్తుంది. ముందుగా మేజర్ అనీష్, కొందరు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, స్థలాభావం, సరుకుల రవాణాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 190 అడుగుల పొడవైన ఈ వంతెన నిర్మాణం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. 

ఈ బృందంలో ఇంజినీర్లు సహా 160 మంది ఉన్నారు. 24 టన్నుల బరువును మోయగల సామర్థ్యం కలిగిన ఈ వంతెన నిర్మాణం పూర్తికావడంతో సహాయక చర్యలకు అవసరమైన భారీ యంత్రాలను ముండక్కైకి తరలించారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఢిల్లీ, బెంగళూరు నుంచి తెప్పించారు. ఢిల్లీ నుంచి కన్నూర్ విమానాశ్రయానికి తీసుకొచ్చిన సరుకులను ట్రక్కుల్లో వయనాడ్ కు తీసుకొచ్చారు. మంగళవారం రాత్రికి మొదటి విమానం వంతెన నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని డెలివరీ చేసింది. 

బుధవారం సాయంత్రం కన్నూర్ చేరుకున్న రెండో విమానంలోని సామగ్రిని రాత్రికి 15 ట్రక్కుల్లో చూరమాల తీసుకువచ్చారు. వీటితో పాటు సామగ్రిని కూడా బెంగళూరు నుంచి భూమార్గం ద్వారా చూరమాల వరకు తరలించారు. బ్రిడ్జి నిర్మాణం తర్వాత కూడా ఎంఈజీ బృందం అత్యవసర సేవల కోసం సంఘటనా స్థలంలోనే వుంది.

ఇలా ఉండగా, వయనాడ్‌ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 308కు చేరింది. ఇంకా సుమారు 300 మంది ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు. మరోవైపు 40 బృందాలు నాలుగో రోజు సహాయక చర్యలు ప్రారంభించాయి. నేవీ, ఎన్​డీఆర్​ఎఫ్, ఇతర సహాయ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. 

ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం దాదాపు 40 బృందాలు మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 190 అడుగుల పొడవున్న బెయిలీ వంతెనను సైన్యం వేగంగా పూర్తి చేసింది. దీనితో రెస్క్యూ కార్యకలాపాలు ఊపందుకున్నాయని అధికారులు తెలిపారు. 

ఈ బ్రిడ్జ్ మీదుగా ఎక్స్‌కవేటర్‌లతో సహా భారీ యంత్రాలను, అంబులెన్స్‌లను కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు తరలించడానికి వీలు కానుందని తెలిపారు. చలియార్​ నది తీర ప్రాంతాల్లో మట్టిదిబ్బల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు సెర్చ్ ఆపరేషన్​ ప్రారంభించనున్నారు. మృతదేహాల కోసం స్థానిక ఈతగాళ్లు నది ఒడ్డున వెతకనున్నారు. 

అదే సమయంలో పోలీసులు హెలికాప్టర్​తో సెర్చ్ ఆపరేషన్​ నిర్వహిస్తారు. అంతేకాకుండా మట్టిదిబ్బల్లో ఉన్న మృతదేహాలను గుర్తించేందుకు దిల్లీ నుంచి డ్రోన్ ఆధారిత రాడార్​ను శనివారం తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి కె రాజన్ తెలిపారు. ప్రస్తుతం ఆరు పోలీసు శునకాలు సెర్చ్ ఆపరేషన్​లో ఉన్నాయని, మరో నాలుగింటిని తమిళనాడు నుంచి వయనాడుకు తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఇప్పటి వరకు మొత్తం 279 శవపరీక్షలు పూర్తి చేసినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. ఈ ఘటనలో 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.