తక్షణమే రాష్ట్రాలు వర్గీకరణను చేపట్టాలి

తక్షణమే రాష్ట్రాలు వర్గీకరణను చేపట్టాలి
తక్షణమే రాష్ట్రాలు వర్గీకరణను చేపట్టాలని  మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ణ డిమాండ్‌ చేశారు. ఇప్పుడు అమలు చేయకుంటే సుప్రీం కోర్టు తీర్పునకు అన్యాయం చేసినట్టేనని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణలో వర్గీకరణను వెంటనే చేపడతారనే విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
ఈ ప్రక్రియ పూర్తయ్యేదాక ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని కోరారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లను అవసరం మేరకు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనివార్యమని మంద కృష్ణ తెలిపారు.
 
30 ఏండ్ల పోరాటానికి ఫలితం దక్కిందని చెబుతూ ఈ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఉద్యమాలను దెబ్బతీసే కుట్రలు ఎన్నో జరిగాయని విమర్శించారు. అయినా సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించామని  తెలిపారు. వర్గీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారని పేర్కొంటూ కృతజ్ఞతలు చెప్పారు. అనుకూల తీర్పునిచ్చిన జడ్జీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 
దేశంలో రిజర్వేషన్ల చట్టం రెండో అడుగు వేయబోతోందని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉందని, కొన్ని కులాలకే రిజర్వేషన్లు మళ్లీమళ్లీ దక్కాయని ఆయన గుర్తు చేశారు. ఇకపై మాత్రం ఆ ఫలాలు అన్ని వర్గాలు, వ్యక్తులు, కుటుంబాలకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది ఒకరి గెలుపు కాదు.. ఒకరి ఓటమి కాదని చెబుతూ సోదర వర్గమైన మాలలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని, అడ్డంకులు సృష్టించొద్దని మంద కృష్ణ విజ్ఞప్తి చేశారు. ‘‘న్యాయమైన వాటా కోసమే తప్ప రిజర్వేషన్‌ ఫలాలన్నీ మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలేదు. మాదిగల కంటే వెనకబడిన ఉప కులాలు ఉంటే వారి వాటా వారికి అందాలి. ఎక్కడ ఏ వర్గానికి, ఏ తెగకు అన్యాయం జరిగినా అక్కడ వర్గీకరణ అమలు చేయవచ్చన్న కోణంలో సుప్రీం కోర్టు తీర్పుని మనం చూడాలి’’ అని స్పష్టం చేశారు.