
రైతు రుణమాఫీ అందని బాధితుల కోసం బిజెపి రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాన్ని కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా “ప్రశ్నిస్తున్న తెలంగాణ” పేరుతో పార్టీ కార్యాలయంలో గోడపత్రికను ఆయన విడుదల చేశారు. రైతురుణమాఫీ అందని రైతులు రైతు హెల్ప్‌లైన్ నెంబర్ 8886100097 కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని వాయిదాల పేరుతో కాలయాపన చేసిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తోన్న ఇంతవరకు రుణమాఫీని పూర్తిగా ఎందుకు అమలు చేయడంలేదని ఆయన నిలదీశారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రుణమాఫీ సకాలంలో జరగకపోవడంతో రైతులు బ్యాంకుల్లో డీఫాల్డర్గా మారేలా ఉన్నారని చెబుతూ దిక్కుతోచని పరిస్థితిలో ఆందోళనలో మునిగారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామ స్థాయిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరించి, రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి రూ. 15,000 పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రూ. 15,000 ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.
ఇందులో ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. అధికారం కోసం రైతులకు మోసపూరిత గ్యారంటీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను దగా చేయడంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఒక్కటేనని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, యువత, బీసీలు, మైనారిటీలు, మహిళలదరికీ వెన్నుపోటు పొడిచిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి నిధుల్లో కోతపెట్టి మోసం చేసిందని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14 శాతానికి పైగా బడ్జెట్ కేటాయింపులు జరిపితే, తెలంగాణలో మాత్రం 7.60 శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించారని విమర్శించారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!