వికసిత్‌ భారత్‌ ప్రస్ధానంలో ఈ ఐదేండ్లు కీలకం

వికసిత్‌ భారత్‌ ప్రస్ధానంలో ఈ ఐదేండ్లు కీలకం
2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ ఐదేండ్ల కాలం అత్యంత కీలకమని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాజ్యసభలో బుధవారం 2024-25 ఆర్ధిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌పై ఆమె మాట్లాడారు. 2014 నుంచి సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా విశ్వాస్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఆ దిశగానే ఈ బడ్జెట్‌ను కూడా రూపొందించామని చెప్పారు.

బడ్జెట్‌పై విస్తృత చర్చ జరిగిందని, 83 మంది సభ్యులు బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాలుపంచుకున్నారని తెలిపారు. ఈ బడ్జెట్‌ గతంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు కొనసాగింపేనని చెప్పారు. వృద్ధి, ఉపాధి కల్పన, సంక్షేమం, మూలధన వ్యయం, పెట్టుబడులే ప్రాధాన్యాలుగా బడ్జెట్‌లో ఆయా రంగాలకు పెద్దపీట వేశామని వెల్లడించారు.

ఆర్ధిక స్ధిరీకరణనూ పరిగణనలోకి తీసుకున్నామని ఆమె తెలిపారు. 2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతం దిగువకు తీసుకొస్తామని 2021లో సభలో తాను హామీ ఇచ్చానని ఆ దిశగానే ముందుకు సాగుతున్నామని చెప్పారు.  ఐఎంఎఫ్‌ గణాంకాల ప్రకారం అంతర్జాతీయ వృద్ధిలో భారత్‌ వాటా 16 శాతంగా ఉందని, అది మరింత పెరగనుందని ఆమె భరోసా ఇచ్చారు. తయారీ రంగం వృద్ధికి బడ్జెట్‌లో పలు ఊతమిచ్చే చర్యలు చేపట్టామని చెప్పారు. దేశం నుంచి మొబైల్‌ ఫోన్ల తయారీ భారీగా పెరిగిందని తెలిపారు.