
‘కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాం. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశాం. దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపింది. కానీ, కేరళ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సకాలంలో ప్రజలను తరలించలేదు’ అని అమిత్ షా విమర్శించారు.
“ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల రాకతో పినరయి విజయన్ ప్రభుత్వం అప్రమత్తమై ఉండి ఉంటే ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవించేవి కావు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది” అని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటని ఈ సందర్భంగా అమిత్ షా పార్లమెంట్‌కు తెలిపారు.
“ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటిపైనా ఓ స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా. 2014 తర్వాత హెచ్చరిక వ్యవస్థపై ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లను ఖర్చు చేసింది. ఈ వ్యవస్థను 2016, 2023లలో ఆధునీకరించాం. ప్రపంచంలోనే ఆధునిక హెచ్చరిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. వారం రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించే 4 దేశాల్లో భారత్ ఒకటి” అని అమిత్ షా చెప్పారు.
“కేంద్ర ప్రభుత్వం జులై 23న కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రమాదం జరగడానికి సుమారు వారం రోజుల ముందే ఇచ్చాం. ఆ తర్వాత జులై 24, 25 తేదీల్లో మరోసారి ఇచ్చాం. జులై 26న 20 సెంటీమీటర్ల భారీ వర్షం కురవనుందని, ఫలితంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించాం. భారీగా బురద ప్రవాహం వస్తుందని, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పాం. అందుకోసమే జులై 23నే సుమారు 9 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు తరలించాం” అని హోంమంత్రి వివరించారు. “కానీ కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందా? ఒకవేళ తరలిస్తే ఇంతమంది ప్రజలు ఎలా మరణించారు?” అని ఆయన ప్రశ్నించారు.
మరోవంక, వయనాడ్ లో మృత్యుఘోష కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనలో 91 మంది మిస్సింగ్ కాగా, 200 మందికిపైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
కాగా, వయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ పునర్నిర్మించుకోవడానికి సాయమందించాలని కోరారు. 2018 వరదల సమయంలో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, అదే తరహా సాయం మళ్లీ కావాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపించాలని సూచించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. వారి కోసం సమీపంలోని చర్చిలు, మదర్సాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
More Stories
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!