రైతు భరోసాకు చట్టబద్ధత కల్పించాలి

రైతు భరోసాకు చట్టబద్ధత కల్పించాలి
రైతు భరోసాకు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యలు జరగకుండా నివారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అసెంబ్లీలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో మహేశ్వర్ రెడ్డి పాల్గొంటూ ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకువస్తామన్నారని ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు.

రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికీ కసరత్తు ప్రారంభించలేదని మండిపడ్డారు. పేదల భూములను ధరణి పోర్టల్‌ పేరుతో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు తమ పేరు చేర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, భూముల లెక్కలను ప్రభుత్వం తేల్చిందా అని ప్రశ్నించారు. ధరణి పేరుతో జరిగిన రెండు లక్షల రూపాయల కుంభకోణం బయటకు తీయాలని డిమాండ్ చేశారు.

అవకతవకల, అక్రమాల ధరణి పోర్టల్ ఏమైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో భూమాత తెస్తామన్నారు. ఇంకా దాని ప్రశస్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే ఎప్పటి వరకు చేస్తుందో, భూ హక్కులు కోల్పోయినటువంటి రైతులందరికీ న్యాయం చేస్తామన్న విషయంపై స్పష్టత ఇవ్వాలి” అని కోరారు. 

కేసీఆర్ పాలనలో దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని చెబుతూ మరి వాటిపై విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వంగా సిద్ధంగా ఉందా? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 40 శాతం దేవాదాయ వక్ఫ్‌ బోర్డు భూములను గత ప్రభుత్వం మింగిందని, ఆ కుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. 

ప్రతి 30 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన సమగ్ర భూసర్వే జరగలేదన్న మహేశ్వర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే ఎప్పటి వరకు చేస్తుందో స్పష్టం చేయాలని కోరారు.మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, తమ పాలనకు ఇంకా నాలుగున్నర యేళ్లు ఉందని, ఒక్కొక్కటిగా అమలు చేసి  తీరుతామని చెప్పారు. 

కాగా హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులెంత చెప్పగలరా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్ఛార్జిగా తాను, నగర పరిధిలోని 15 మంది ఎమ్మెల్యేలతో కలసి కేంద్రం వద్దకు పోదామా? అని ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు. ఎనిమిది ఎమ్మెల్యేలను, ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.