పశ్చిమ బెంగాల్ లో రాజకీయ దుమారం రేపుతున్న `విభజన’ అంశం!

పశ్చిమ బెంగాల్ లో రాజకీయ దుమారం రేపుతున్న `విభజన’ అంశం!
బ్రిటిష్ కాలంలో 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను ప్రకటించాడు. లార్డ్ కర్జన్ ప్రకటన తర్వాత, బెంగాల్ అంతటా ఆగ్రహం చెలరేగింది. హింసాత్మక నిరసనలు జరిగాయి, చివరికి లార్డ్ కర్జన్ విభజన ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసి వచ్చింది. కానీ 1947లో, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ బెంగాల్ తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ బెంగాల్‌గా విభజించబడింది.
 
ఆ విభజన బాధను బెంగాల్ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ప్రజలు ఇప్పటికీ ఒపర్ బంగ్లా, ఎగువ బంగ్లా (మరోవైపు బంగ్లాదేశ్, మరోవైపు పశ్చిమ బెంగాల్)తో సంబంధాలు కలిగి ఉన్నారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో కూడా చాలా మంది ప్రజలు పశ్చిమ బెంగాల్, దేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వచ్చింది.
 
 దేశ విభజన సమయంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన కృషి పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాలను తూర్పు బెంగాల్‌లో విలీనం చేయకుండా కాపాడింది.  పశ్చిమ బెంగాల్ మనుగడ సాగించింది. అయితే పశ్చిమ బెంగాల్‌ను విభజించాలని ఎప్పటికప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి.
 
తాజాగా, ఉత్తర బెంగాల్‌ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచలనం రేపింది.  బీజేపీ విజ్ఞప్తిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. కేంద్రంలోని బీజేపీ బెంగాల్‌, బెంగాల్‌ ప్రజల వ్యతిరేక పార్టీ అని విమర్శించింది. బీజేపీ నేతలు గతంలో కూడా ఉత్తర బెంగాల్‌లోని జిల్లాలను కేంద్ర పాలిత ప్రాంతం, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ల ద్వారా విభజించడానికి ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ, వారి ప్రయత్నాలు సాగనివ్వమని హెచ్చరించింది.
 
అయితే, బెంగాల్ విభజనకు తమ పార్టీ వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేస్తుంది. సుకాంత్ మజుందార్ ఉత్తర బెంగాల్‌ను నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్‌లో చేర్చాలని మాత్రమే ప్రతిపాదించారని, తద్వారా ఉత్తర బెంగాల్ కూడా సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేటాయింపుల నుండి ప్రయోజనం పొందుతుందని సూచించారని వివరణ ఇస్తుంది. 
 
కానీ, ఉత్తర బెంగాల్‌కు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్‌ చాలాకాలంగా ఉంది.  ఉత్తర బెంగాల్‌లో మాత్రమే డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్, కూచ్ బెహార్‌లో గ్రేటర్ కూచ్ బెహార్, ప్రత్యేక కమ్తాపురి రాష్ట్రం, దక్షిణ బెంగాల్‌లో రార్ బెంగాల్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్‌లు వచ్చాయి. ఉత్తర బెంగాల్‌లోని ఈ జిల్లాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఆధిపత్యంలో ఉన్నాయి.
 
ఇక్కడి ప్రజలు 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఓటు వేశారు. ఉత్తర బెంగాల్ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు, ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాలు, 54 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తర బెంగాల్‌లోని ఈ ఎనిమిది జిల్లాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లతో సరిహద్దులను పంచుకుంటాయి. వ్యూహాత్మక కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనవి.
 
ఈ జిల్లాల్లో కోచే, రాజవంశీ, గూర్ఖా మరియు గిరిజన తెగలు ఉన్నాయి. అంతకుముందు, అఖిల భారతీయ ఆదివాసీ వికాస్ పరిషత్ (ఎబిఎవిపి), గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం), కమతాపూర్ పీపుల్స్ పార్, ఇతరులు ఉత్తర బెంగాల్‌ను ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు.
 

రాష్ట్ర విభజనపై బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి మజుందార్‌ మాట్లాడుతూ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంత జిల్లాలకు, ఈశాన్య రాష్ర్టాలకు ఉన్న పోలికలు గురించి ప్రధాని మోదీని కలిసి వివరించినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలను ఈశాన్య రాష్ర్టాల్లో కలపాలని కోరానని తెలిపారు. అదే సమయంలో కూచ్‌ బెహార్‌ను దక్షిణ బెంగాల్‌ నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం చేయాలని బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్‌ డిమాండ్‌ చేశారు.కాగా, బెంగాల్‌ విభజన గురించి బీజేపీ ఇలా డిమాండ్‌ చేయడం ఇది తొలిసారి కాదు. ఉత్తర బెంగాల్‌ ప్రాంతం చాలాకాలంగా రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నదని, దానిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని 2021లో అప్పటి కేంద్ర మంత్రి జాన్‌ బర్లా డిమాండ్‌ చేశారు. 

అదే ఏడాది వేసవి వేడిమి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించగా, తమకు వాతావరణం చల్లగా ఉందని, సెలవులు అక్కర్లేదని పేర్కొంటూ, అందుకే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నట్టు సిలిగురి ఎమ్మెల్యే ఘోష్‌ కోరారు. అలాగే డార్జిలింగ్‌ హిల్స్‌ను బెంగాల్‌ నుంచి విడదీయాలని ఒక ఎమ్మెల్యే, జంగల్‌ మహల్‌ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని మరో ఎంపీ డిమాండ్‌ చేశారు.

కాగా, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెల్చుకున్న 12 సీట్లలో ఆరు ఉత్తర బెంగాల్  ప్రాంతానివి కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఏడు సీట్లను నెగ్గింది. దీంతో బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతం కన్నా ఇక్కడ ఆ పార్టీ దృష్టి కేంద్రీకరిస్తున్నది. 

 రాష్ట్ర విభజన తమ లక్ష్యం కాదని, రాష్ట్రం మొత్తం అభివృద్ధినే తాము కోరుంటున్నట్టు ఆ పార్టీ ఎంపీ సమిక్‌ భట్టాచార్య చెబుతున్నప్పటికీ అంతర్గతంగా ఆ పార్టీ లక్ష్యం వేరే ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నదని, అందులో భాగంగానే ఈ విభజన అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌ను విభజించేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్‌ను విభజించడం అంటే దేశాన్ని విభజించడం వంటిదేనని అంటూ తీవ్రపదజాలం వాడారు. దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని తేల్చిచెప్పారు.