అమెరికాలో భారత సంతతి యువతకు బహిష్కరణ ముప్పు

అమెరికాలో భారత సంతతి యువతకు బహిష్కరణ ముప్పు
వారంతా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకున్నారు. కుటుంబం, స్నేహితులు, వృత్తి అంతా అక్కడే. కానీ, ఉన్నఫళంగా అన్నింటినీ వదిలేసి, దేశాన్ని విడిచి తమ సొంత దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  అమెరికాలో దాదాపు 2.50 లక్షల మంది యువతీ యువకులు ఎదుర్కొంటున్న ‘ఏజింగ్‌ అవుట్‌’ ముప్పు సమస్య ఇది.
వీరిలో భారత సంతతికి చెందిన వారే దాదాపు సగం మంది ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వీరి భవిష్యత్తు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది.  భారత్‌ సహా వేర్వేరు దేశాల నుంచి అమెరికాకు తాత్కాలిక వర్క్‌ వీసాల మీద వెళ్లిన వ్యక్తులు పిల్లలను కూడా తమతో తీసుకెళ్లవచ్చు. ఈ పిల్లలు తల్లిదండ్రులపై ‘డిపెండెంట్‌(ఆధారపడినవారు)’ హోదాతో అమెరికాలో ఉండేందుకు వీలు ఉంటుంది. 

అయితే, వీరికి 21 ఏండ్ల వయస్సు వచ్చినా, వివాహం జరిగినా డిపెండెంట్‌ హోదా కోల్పోతారు. అంతలోపు వారికి గ్రీన్‌ కార్డు, ఇతర వీసా ఏదైనా రాకపోతే వారు బలవంతంగా అమెరికా నుంచి వారి సొంత దేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్యనే ‘ఏజింగ్‌ అవుట్‌’ అంటారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే యువతీ యువకులను ‘డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌’ అని పిలుస్తారు. 

‘‘వీరంతా మన దేశంలో పెరిగిన వారే. ఇక్కడే చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ పట్టాలు సైతం అందుకున్నారు. ఇలాంటి వారిని గ్రీన్‌ కార్డు లేదన్న కారణంగా దేశం నుంచి పంపిచేయడం భావ్యంకాదు. కాబట్టి వారికి రక్షణ కల్పించండి’’ అని చట్టసభ సభ్యులు అధ్యక్షుడికి రాసిన లేఖలో విన్నవించారు.

అయితే, అమెరికాలో స్థిరపడటానికి ఇచ్చే గ్రీన్‌ కార్డుల జారీ చాలా ఆలస్యమవుతున్నది. ఏండ్ల తరబడి గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ(ఎన్‌ఎఫ్‌ఏపీ) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం 12 లక్షల మంది ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

అమెరికాలో పెరిగి, చదువుకున్న యువత ఇలా దేశం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. వీరికి ఉపయోగపడేలా తీసుకువచ్చిన ఒక ఒప్పందాన్ని రెండుసార్లు రిపబ్లికన్లు ఆమోదం పొందకుండా అడ్డుపడ్డారని వైట్‌హౌస్‌ పత్రికా కార్యదర్శి కరైన్‌ జీన్‌ పియెర్రీ ఆరోపించారు.

‘ఏజింగ్‌ అవుట్‌’ ముప్పు ను ఎదుర్కొంటున్న యువత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని 43 మంది చట్టసభ్యులు బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.