
ఈ ఎన్కౌంటర్లో పాకిస్థాన్ చొరబాటుదారుడు కూడా మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఉదయం కామ్‌కారి సెక్టార్లో ‘బోర్డర్ యాక్షన్ టీమ్’ జరిపిన దాడిని అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు విఫలం చేశాయని అక్కడి ఉన్నాతాధికారులు ప్రకటించారు. గంటల తరబడి జరిగిన భీకర కాల్పుల మధ్య ఇద్దరు చొరబాటుదారులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి పారిపోయారని వర్గాలు తెలిపాయి.
ఉత్తర కశ్మీర్ జిల్లాలోని ట్రెహ్గామ్ సెక్టార్‌లోని కుంకడి పోస్ట్ సమీపంలోని ఫార్వర్డ్ పోస్ట్‌పై ముగ్గురు చొరబాటుదారుల బృందం గ్రెనేడ్ విసిరి కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. ఆ క్రమంలోనే సమాచారం అందుకుని అప్రమత్తమైన భారత సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ తరువాత ఇరుపక్షాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. వారిలో ఒకరు ఆ తర్వాత మరణించారని అధికారులు వెల్లడించారు. గాయపడిన నలుగురు సైనిక సిబ్బందిని కెప్టెన్ సహా బేస్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన సైనికుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బోర్డర్ యాక్షన్ టీమ్ లేదా బాట్ లో పాకిస్థానీ ఆర్మీ కమాండోలు, ఉగ్రవాదులు ఉంటారు. వీరు నియంత్రణ రేఖలో చొరబాటుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు గత మూడు రోజుల్లో కుప్వారాలో ఇది రెండో ఎన్కౌంటర్ కావడం విశేషం.
ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు సాధ్యమేనన్న సమాచారంతో ఈ ప్రదేశంలో ఆర్మీ దళాలు ఆపరేషన్ నిర్వహించాయి. అంతకుముందు జూలై 24న కూడా కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో రాత్రిపూట జరిగిన ఎన్కౌంటర్ జరుగగా భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ కాల్పుల్లో ఓ భారత సైనికుడు కూడా మృతి చెందాడు.
అయితే నిన్న లడఖ్‌లోని కార్గిల్‌లో ప్రధాని మోదీ పర్యటించిన తర్వాత ఈ కాల్పులు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ బుద్ది ఇంకా మారలేదని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని మోదీ మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు తగ్గేది లేదని, తిప్పి కొడతామని మోదీ హెచ్చరించారు. కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షిక వేడుకల సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయగా.. ఈ వేడుకలు జులై 24 నుంచి జులై 26 వరకు నిర్వహించారు.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ