గణనీయంగా ఐ-ఫోన్ల ధరలు తగ్గించిన ఆపిల్

గణనీయంగా ఐ-ఫోన్ల ధరలు తగ్గించిన ఆపిల్
గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. తదనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గించింది. 
 
దీంతో భారతీయ స్మార్ట్ ఫోన్ యూజర్లకు లబ్ధి చేకూరనున్నది. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకూ తగ్గనున్నాయి. ఐ-ఫోన్ 13, ఐ-ఫోన్ 14, ఐ-ఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారయ్యే ఐ-ఫోన్ల ధరలు రూ.300, ఐ-ఫోన్ ఎస్ఈ ధర రూ.2300 తగ్గనున్నది.

ఆపిల్ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 15 శాతానికి తగ్గించింది. సంప్రదాయంగా కొత్త ఐ-ఫోన్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నప్పుడు పాత మోడల్ ఫోన్ల ధరలు తగ్గిస్తూ వస్తుంది. 

ఆపిల్ ధర తగ్గింపుతోపాటు డీలర్లు, రీసెల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వల సేల్స్ క్లియర్ చేసుకోవడానికి అదనపు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు.

ఫోన్ మోడల్ – పాత ధర – కొత్త ధర

ఐ-ఫోన్ ఎస్ఈ -రూ.49,900- రూ. 47,600
ఐ-ఫోన్ 13 – రూ. 59,900 – రూ.59,600
ఐ-ఫోన్ 14 – రూ.69,900 – రూ. 69,600
ఐ-ఫోన్ 14 ప్లస్ – రూ.79,900 -రూ. 79,600
ఐ-ఫోన్ 15 – రూ.79,900 – రూ.79,600
ఐ-ఫోన్ 15 ప్లస్ – రూ.89,900 – రూ.89,600
ఐ-ఫోన్ 15 – రూ. 1,34,900 – రూ. 1,29,800
ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ – రూ. 1,59,900 – రూ. 1,54,000