
కార్గిల్ యుద్ధం అధికారికంగా 25 సంవత్సరాల క్రితం, జూలై 26, 1999న ముగిసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతికూలమైన పర్వత ప్రాంతంలో ఎత్తైన పర్వతాలపై తిష్టవేసిన శత్రు సేనలను అత్యంత వీరోచితంగా కిందనుండి పర్వతం ఎక్కుతూ, తుపాకీ తూటాలను సహితం లెక్కచేయకుండా పోరాడి విజయం సాధించి, మొత్తం ప్రపంచాన్ని నివ్వెర పరచిన భారతీయ సైనికుల పరాక్రమంకు ప్రతీకగా ఈ రోజున కార్గిల్ విజయ్ దివస్ గా ప్రతి ఏడాది జరుపుకుంటున్నాము.
పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన విజయాన్ని, కాశ్మీర్ ను కంబళించఛాలనే కాశ్మీర్ సేనల దుష్ట పన్నాగాన్ని తిప్పికొట్టిన సాహసోపేత మన సైనికుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం. ఒక వంక పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానంపై మన ప్రధాని వాజపేయి రోడ్ మార్గంపై కరాచీ వరకు వెళ్లి, ఆ దేశంతో స్నేహ ఒడంబడిక చేసుకుంటున్న సమయంలోనే కార్గిల్ దురాక్రమణకు పాక్ సేనలు సన్నాహాలు చేస్తూ వచ్చారు.
పాకిస్తాన్ నుండి చొరబాటుదారులు నియంత్రణ రేఖను దాటి లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలో పర్వత ప్రాంతాలను ఆక్రమించడంతో ఈ వివాదం మొదలైంది. సుమారు నెల రోజుల తర్వాత మే 3న గాని భారత సైన్యానికి సమాచారం అందలేదు. మొదట్లో చొరబాటుదారులను జిహాదీలుగా భావించారు. కానీ తరువాతి కొన్ని వారాలలో, పాకిస్తాన్ సైనికులే దండయాత్రకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. పూర్తి సన్నాహాలతో యుద్ధం జరిపేందుకు వారు ఎత్తైన పర్వత స్థావరాలను ఆక్రమించుకున్నట్లు స్పష్టమైంది.
అంత ఎత్తులో ఉన్న శత్రుసేనలను ఎదుర్కోవడం అసాధ్యం అంటూ అంతర్జాతీయ నిపుణులు సహితం పెదవి విరిచారు. కార్గిల్ శ్రీనగర్‌కు ఈశాన్యంగా 200 కి.మీ, లేహ్‌కు పశ్చిమాన 230 కి.మీ దూరంలో నియంత్రణ రేఖ ఉత్తర అంచున ఉంది. కార్గిల్ పట్టణం 2,676 మీ (8,780 అడుగులు), ద్రాస్ 3,300 మీ (10,800 అడుగులు) ఎత్తులో ఉంది. చుట్టుపక్కల ఉన్న శిఖరాలు 4,800 మీ (16,000 అడుగులు) నుండి 5,500 మీ (18,000 అడుగులు) ఎత్తులో ఉన్నాయి.
“సన్నని గాలి, చల్లని వాతావరణం, కఠినమైన పర్వతాల కలయిక సైనికుల పరికరాలపై నాటకీయ ప్రభావాలను చూపుతుంది” అమెరికా సైనికాధికారి అకోస్టా రాశాడు. కార్గిల్‌లోని యుద్ధభూమి చల్లని ఎడారిలో ఉంది. ఇక్కడ శీతాకాలపు ఉష్ణోగ్రతలు -30 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. వేసవికాలం మరింత ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, శీతలమైన గాలులు, బంజరు ప్రకృతి దృశ్యం సైనికులకు అక్కడకు చేరుకుని పోరాడటం పెద్ద సవాల్ గా పరిణమించింది.
ఆ చలిని తట్టుకొని సైనికులు తుపాకులను ఎక్కుపెడితే అవి జామ్ అవుతూ ఉండెడివి. చలిలో ఆక్సిజన్ స్థాయిలను సహితం తగ్గించెడిది. తీవ్రమైన పర్వత అనారోగ్యంతో సహా సైనికులలో అనేక రకాల శారీరక ప్రభావాలకు దారితీసింది. ఇది తలనొప్పి, వికారం, ఆకలి, కండరాల బలహీనత, సాధారణ అలసటకు కారణమవుతుంది. సైనికుల బలాన్ని తగ్గించడంతో పాటు, తక్కువ వాయు పీడనం ఆయుధాలు, విమానాల పనితీరుపై ప్రభావం చూపింది.
ఇటువంటి ఎన్నో ప్రతికూలతలు అధిగమించి మన సేనలు వీరోచితంగా పోరాడి విజయం సాధించాయి. కనికరం లేకుండా శత్రుసేనలు కొండపై నుండి కాల్పులు జరుపుతున్నా లెక్కచేయకుండా ఎదురొడ్డి పోరాడారు. కార్గిల్ శిఖరాల నుండి పాకిస్తాన్ చొరబాటుదారులు వెనుకకు వెళ్లిపోయేటట్లు చేశారు.
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం, యుద్ధం ముగిసే సమయానికి 527 మంది భారతీయ సైనికులు మరణించారు. 1,363 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు పాకిస్తాన్ అధికారికంగా తమ సైనికులు ఎంతమంది మృతిచెందారో ప్రకటించలేదు. కానీ 3,000 మందికి పైగా మృతి చెందారని పలు కధనాలు వెల్లడి చేస్తున్నాయి.
మొత్తం 75 ఏళ్లలో భారత్ స్పష్టంగా యుద్ధంలో పాకిస్తాన్ పై విజయం సాధించింది 1971లో మాత్రమే. అగ్రరాజ్యాల బెదిరింపులను లెక్కచేయకుండా, తగినన్ని సాయుధ సంపత్తులు లేకపోయినా వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ఏర్పాటుకు భూమిక అయిన మతం ఓ దేశాన్ని కలిపి ఉంచలేదని ఆ దేశం రెండు ముక్కలయ్యేవిధంగా చేసి నిరూపించాము. ఆ తర్వాత పలు విధాలుగా కార్గిల్ అనుభవాలు మన భద్రతా వ్యవస్థను, దౌత్య విధానాన్ని రాటుతేలే విధంగా చేసింది.
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సైన్యం కలిగిన దేశంగా భారత్ గుర్తింపు పొందినా జాతీయ భద్రతా విధానం లేని ముఖ్యమైన దేశం మనది మాత్రమే అని చెప్పవచ్చు. భద్రతకు సంబంధించి ఏకీకృత నిఘా వ్యవస్థ లేకపోవడం, మన సేనలు ఆధునిక యుద్దానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా వెల్లడైంది. ముఖ్యంగా అమెరికా, చైనా పాకిస్తాన్ కు మద్దతుగా ఉన్నప్పటికీ వాజపేయి ప్రభుత్వం చేపట్టిన అపూర్వమైన దౌత్య విధానం కారణంగా ఆ దేశాలు ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు మద్దతుగా యుద్ధంలో పాల్గొనలేక పోయాయి.
ఎన్ని కవ్వింపు చర్యలు ఎదురైనా నియంత్రణ రేఖకు దాటకుండా సంయమనం పాటించిన కారణంగా స్వయంగా అమెరికా పాకిస్తాన్ అధ్యక్షుడిని పిలిచి ముందుగా కార్గిల్ నుండి సేనలను వెనుకకు పిలిపించి మాట్లాడమని హెచ్చరించే పరిస్థితులు కలిగించాము. మరోవైపు నుండి చైనా భారత్ పై యుద్ధం చేస్తుందని ఆశించిన పాకిస్తాన్ కు భారత్ దౌత్య విధానం కారణంగా ఆ దేశం కదలలేని పరిస్థితి సృష్టించాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను భారత్ ఏకాకి చేయగలిగిన మొదటి సందర్భం ఇదే అని చెప్పవచ్చు.
అప్పటివరకు ఘర్షణల సమయంలో పాకిస్తాన్ కు మద్దతుగా ఉంటూ వస్తున్న అమెరికా, చైనా, ఐరోపా దేశాలు తప్పనిసరి పరిస్థితులలో దూరంగా ఉండే విధంగా భారత్ చేయగలిగింది. ఇక భారత రక్షణ వ్యవస్థను ఆధునీకరణ చేసే పక్రియ కార్గిల్ తర్వాతనే ప్రారంభమైంది. ఈ సందర్భంగా వాజపేయి ప్రభుత్వం నరసింహన్ కమిటీని ఏర్పాటు చేసి, మన భద్రతా వ్యవస్థ లోటుపాట్లపై సమగ్రమైన అధ్యయనం జరిపించింది.
దేశ రక్షణకు సంబంధించిన అంశాలపై బహిరంగ విచారణ జరిపిన ఏకైక సందర్భంగా నరసింహన్ కమిటీ విచారణ కావడం గమనార్హం. ఈ కమిటీ ఇచ్చిన సమగ్రమైన నివేదిక ఆధారంగా వాజపేయి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేసి, నివేదికలోని సూచనల అమలుకు చర్యలు ప్రారంభించారు. ఈ లోగా ఆయన ప్రభుత్వం పడిపోయింది.
ఇంత ఎత్తులో పోరాటం జరిపేందుకు మన సైన్యం, వైమానిక దళం సిద్ధంగా లేదని వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో కొంతమేరకు ఎక్కువగా ప్రాణనష్టంకు దారితీసాయి. పైగా, ఇంతటి చల్లని వాతావరణంలో యుద్ధం చేసేందుకు అవసరమైన ఉన్ని వస్త్రాలు, ఆయుధాలు కూడా మన సేనలకు లేవు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మన సేనలు తమ శిక్షణ పద్దతులను, ఆయుధాల సమీకరణను తదనుగుణంగా మార్చుకొంటూ వస్తున్నాయి.
కార్గిల్ యుద్ధం నేర్పిన అతిపెద్ద గుణపాఠం రక్షణ వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సైనికాధికారులు కీలక పాత్ర కల్పించాల్సిన అవసరాన్ని వెల్లడి చేసింది. రక్షణ వ్యవస్థలో కూడా క్షేత్రస్థాయి ఆధిపత్యం లేని ఐఏఎస్ అధికారుల ఆధిపత్యం అనేక అనర్ధాలకు దారితీస్తున్నట్లు గ్రహించాము. నరసింహన్ కమిటీ సహితం ఈ విషయంలో కీలకమైన సిఫార్సులు చేసింది.
త్రివిధ దళాలను ఏకోన్ముఖంగా నడిపించేందుకు చీఫ్ అఫ్ డిఫెన్సె సర్వీసెస్ (సిడీఎస్)ను నియమించాలని నరసింహన్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే అటువంటి నియామకాన్ని ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకుంటూ వచ్చింది. మొదటి సిడిఎస్ ను నియమించే పక్రియ ప్రారంభించిన కొద్దీ రోజులకే వాజపేయి ప్రభుత్వం పడిపోయింది. యుపిఎ ప్రభుత్వంలో పెద్దగా అటువంటి ప్రయత్నం జరగలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రయత్నం ప్రారంభించినా చేయలేక పోయారు. చివరకు ప్రధాని మోదీ 2019లో మాత్రమే నియమించ గలిగారు.
సిడిఎస్ ను నియమించినా ఆశించిన విధంగా పూర్తి స్థాయి అధికారాలు ఇంకా ఇవ్వలేదు. సిసిఎస్ అధికార పరిధిపై ఇంకా స్పష్టత లేదు. రక్షణ శాఖ కార్యదర్శిగా బాద్యఃతలు అప్పచెప్పడం లేదు. ఇంకా ఐఏఎస్ అధికారుల పెత్తనం సాగుతుంది. ఇప్పటికీ జాతీయ భద్రత విధానం రూపొందించుకొని ప్రయత్నం జరగడం లేదు. రక్షణ ఉత్పత్తుల తయారీలో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నా ప్రభుత్వ రంగసంస్థలు తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు ప్రైవేట్ రంగాన్ని నిరుత్సాహపరచే విధంగా వ్యవహరిస్తున్నాయి. నరసింహన్ కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయగలిగినప్పుడే కార్గిల్ వీరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించినల్టు కాగలదు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!