రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌‌, అశోక్‌ హాల్‌ పేర్లు మార్పు

రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌‌, అశోక్‌ హాల్‌ పేర్లు మార్పు
రాష్ట్రపతి భవన్‌ లోని ముఖ్యమైన రెండు హాళ్ల పేర్లు మారాయి. పలు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉన్న ‘దర్బార్‌ హాల్’, ‘అశోక్‌ హాల్‌’ పేర్లను కేంద్రం మార్చింది. ఇకపై వీటిని ‘గణతంత్ర మండపం’, ‘అశోక్‌ మండపంగా’ పిలవనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ గురువారం వెల్లడించింది. భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా చేయడంలో భాగంగా పేర్లు మార్చడం జరిగిందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా, జాతీయ అవార్డుల ప్రదానం వంటి కీలక కార్యక్రమాలు ‘దర్బార్ హాల్’లోనే జరుగుతుంటాయి. ‘దర్బార్’ అనే పదం కోర్టు, అసెంబ్లీ అనే అర్థాలను ప్రతిబింబిస్తుంది. భారత్లో రాజుల కాలంలో, బ్రిటీష్ పాలనలో ఈ ‘దర్బార్’ అనే పదం వాడుకలో ఉండేది. భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించాక ‘దర్బార్’ అనే పదం దాని ప్రాముఖ్యతను కోల్పోయిందని ప్రభుత్వం పేర్కొంది.

‘గణతంత్ర’ అనే పదం స్వతంత్ర భారతంలో ప్రాముఖ్యతను సంతరించుకుందని.. అందువల్లే ‘దర్బార్ హాల్’ పేరును ‘గణతంత్ర మండపం’ అని మారుస్తున్నట్లు వెల్లడించింది. ఇకపోతే ‘అశోక్ హాల్’ పేరును ‘అశోక్ మండపం’ అని మార్చడంపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది. ‘అశోక్ హాల్’ నిజానికి ఒక బాల్‌రూమ్. ‘అశోక్’ అంటే ‘అన్ని బాధల నుండి విముక్తి’ లేదా ‘ఏ దుఖం లేని’ వ్యక్తిని సూచిస్తుంది.

 ‘అశోక’ అనే పేరు గొప్ప రాజు అయిన ‘అశోక చక్రవర్తి’ పేరును ప్రతిబింబిస్తుందని కేంద్రం తెలిపింది. జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్న విషయాన్ని కూడా గుర్తుచేసింది. ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి చిహ్నం. అశోక పదం భారతీయ మత సంప్రదాయాలు, కళలు, సంస్కృతిలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉందని వివరించింది. సమాజంలో అశోక చెట్టుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా ‘అశోక్ హాల్’ పేరును ‘అశోక్ మండపం‌’గా మార్చినట్లు వెల్లడించింది.