మహారాష్ట్రను భారీ వర్షం ముంచెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని కుంభవృష్టి కురుస్తోంది. పుణేలో సైన్యం, ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలను రంగంలోకి దించారు. ఈ వర్షానికి ముంబై మహానగరం జలమయమైంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు నదులను తలపిస్తున్నాయి. నగరం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. నగరానికి నీటిని సరఫరా చేసే సరస్సులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముంబై మహా నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు సరస్సుల్లో రెండు ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. మోదక్-సాగర్ సరస్సు, విహార్ సరస్సు పొంగిపొర్లుతున్నాయని పేర్కొంది. దీంతో సాయన్, చెంబూర్, అంధేరీ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది.
రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు శుక్రవారం వరకూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఈ భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.
వర్షం కారణంగా విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. విమానాశ్రయాలకు బయల్దేరే ముందు ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోవాలంటూ ఇండిగో సంస్థ ప్రయాణికుల సూచించింది. స్పైస్‌జెట్ సైతం ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు విమాన కార్యకలాపాలను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.
ఈ కారణంగా విమానాల్లో కొన్నింటిని రద్దు చేయడం, మరికొన్నింటిని దారి మళ్లించడం వంటివి జరుగుతున్నట్లు పేర్కొంది. మరోవైపు ముంబై నగరానికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. నగర ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.
కుండపోత వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు చేరింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడి అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు పూణె, కొల్హాపూర్‌లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధం ఏర్పడి జనజీవనం స్తంభించింది. పాఠశాలలు మూసివేయబడ్డాయి.
పూణేలోని పింప్రి చించ్వాడ్లోని అనేక నివాస అపార్ట్మెంట్లు జలమయమయ్యాయి. ఏక్తా నగర్ వంటి వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు అగ్నిమాపక శాఖ పడవలను ఉపయోగిస్తోంది. కొన్ని చోట్ల నడుము మట్టం వరకు నీరు చేరుకుంది. ఈ క్రమంలో పలు చోట్ల రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
పూణెలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షాల(rains) కారణంగా నీట మునిగిన హ్యాండ్‌కార్ట్‌ను తరలించే ప్రయత్నంలో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో మరణించారని పోలీసులు తెలిపారు. డెక్కన్ జింఖానా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు.
ఖడక్వాస్లా డ్యామ్ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం డ్యాం పూర్తి స్థాయికి చేరుకుంది. కురుస్తున్న వర్షాల కారణంగా నీటి మట్టం పెరగడంతో ముతా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పూణె జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేయాలని లెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు. మునిగిపోయే ప్రమాదం ఉన్న వంతెనలపై ట్రాఫిక్‌ను నిషేధిస్తామని ఆయన వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా ఖడక్ వాస్లా డ్యాం కూడా పూర్తి స్థాయికి చేరుకుంది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో ఒకటైన విహార్ సరస్సు ఈరోజు తెల్లవారుజామున పొంగిపొర్లడం ప్రారంభించిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. వాతావరణ శాఖ గురువారం మహారాష్ట్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పంచగంగా నది ప్రమాద స్థాయి కంటే కొన్ని అంగుళాల దిగువన ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు.
More Stories
26/11 ఉగ్రదాడి తరహా 200 ఐఈడీలతో ఢిల్లీలో దాడులకు కుట్రలు
ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ!
ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు!