బిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎంఎల్‌ఎలు గైరాజర్

బిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎంఎల్‌ఎలు గైరాజర్

పార్టీ ఎంఎల్‌ఎల వరుస ఫిరాయింపులతో సతమతమవుతున్న బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌ మంగళవారం స్వయంగా నిర్వహించిన బిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంఎల్‌ఎలు, ముగ్గురు ఎంఎల్‌సిలు గైర్జాజరరయ్యారు.  ఈ భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, హరీష్ రావు సహా ఇతర బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు హాజరయ్యారు.

కాంగ్రెస్‌లోకి పోయిన ఎంఎల్‌ఎలు పోగా, మిగిలిన 28 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలలో ఐదుగురు ఈ భేటీకి డుమ్మా కొట్టారు. జహిరాబాద్ ఎంఎల్‌ఎ మాణిక్య రావు, దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ ఎంఎల్‌ఎ బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎంఎల్‌ఎ తీగుళ్ళ పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌సిలు చల్లా వెంకటరామిరెడ్డి, గోరేటి వెంకన్న, వెంకట్రామ్రెడ్డిలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. 

బిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు ముందుగానే అందించినప్పటికీ వీరు హాజరుకాక పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ మారే క్రమంలోనే వారిలో కొందరు ఈ సమావేశానికి గైర్హాజరైనట్లుగా ప్రచారం జోరందుకుంది. మరోవైపు బిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బిఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలను ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. 

రైతు భరోసా, నిరుద్యోగుల ఆందోళన, రూ.2 లక్షల రుణమాఫీకి నిబంధనలు విధించడం, ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలను హైలెట్ చేస్తూ సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని నేతలకు కెసిఆర్ సూచించారు. అయితే, కెసిఆర్ అధ్యక్షతన జరిగిన బిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశానికి ముందస్తు అనుమతితోనే కొందరు ఎంఎల్‌ఎలు భేటీకి హాజరు కాలేదని మాజీ మంత్రి, హరీశ్‌రావు వెల్లడించారు.

రాజకీయ కక్షతోనే తన కూమార్తెను జైళ్లో పెట్టారని ఈ సందర్భంగా కెసిఆర్ ఆరోపించారు. సొంత బిడ్డ జైళ్లో ఉంటే కన్న తండ్రిగా తనకు బాధగా ఉండదా? ప్రస్తుతం తాను సలసల మరిగిపోయే అగ్ని పర్వతంలా ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఎల్‌ఎలు వరుసగా పార్టీ వీడటంపై ప్రస్తావిస్తూ పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఏమి లేవని, ఇంతకంటే ఇబ్బంది కర పరిస్థితుల్లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

 
మొన్నటి వరకు నలుగురు ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అని తిరిగి ప్రశ్నించారు. అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎంఎల్‌ఎ బాగా ఎదుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కాంగ్రెస్ పాలనపై పట్టు సాధించలేకపోయిందని ధ్వజమెత్తారు.
పాలనపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని చురకలంటించారు.