పిల్లల భవిష్యత్‌కు భరోసానిచ్చే ఎన్‌పీఎస్‌ వాత్సల్య

పిల్లల భవిష్యత్‌కు భరోసానిచ్చే ఎన్‌పీఎస్‌ వాత్సల్య
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. అదే ఎన్‌పీఎస్‌ వాత్సల్య. ఇది పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల పేరుపై పాలసీలు తీసుకోవచ్చు లేకపోతే పెట్టవచ్చు. 
పిల్లలకు మెజారిటీ వయసు వచ్చాక ఈ పథకాన్ని నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ స్కీమ్‌ గా మార్చేకునే వీలు సైతం ఉంటుంది.
పిలల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పిల్లల పేరుతో కొంత డబ్బును ఆదా చేసుకునేందుకు అవకాశం ఉన్నది.  పోస్టాఫీసులు, ఏదైనా జాతీయ బ్యాంకులో నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద వాత్సల్య ఖాతాను తెరవాలి. పిల్లల తల్లిదండ్రులు ప్రతి నెలా నిర్ధిష్ట వ్యవధిలో ఖాతాకు డబ్బులను బదిలీ చేస్తూ పొదుపు చేయవచ్చు. 
ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్‌పీఎస్‌ స్కీమ్‌ తరహాలోనే పని చేసినా ఈ పథకం 18 ఏళ్లలోపు స్కీమ్‌ అయినందున కాస్త భిన్నంగా ఉండనున్నది. పిల్లలు మెజారిటీ వయసు దాటాక ఈ పథకాన్ని సాధారణ ఎన్‌పీఎస్‌ ఖాతాగా మార్చేందుకు అవకాశం ఉంది. ఈ పథకం కింద పిల్లలకు ప్రారంభంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం 18ఏండ్ల నుంచి 65ఏండ్ల వరకు లేదంటే, రిటైర్‌మెంట్‌ వరకు ఉంటుంది.

70ఏండ్ల వరకు అకౌంట్‌ను కొనసాగించొచ్చు. రిటైర్‌మెంట్‌ తర్వాత మెచ్యూరిటీ సమయం, 60 సంవత్సరాలు వచ్చిన సమయంలో ఉద్యోగి మొత్తం ఫండ్‌లో కనీసం 40శాతంతో యాన్యుటీప్లాన్ తీసుకోవాలి. ఈ ఫండ్‌లో 60శాతం మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులో సాధారణంగా ఇతర పొదుపు పథకాల కంటే ప్రభుత్వం అందించే వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. 

ఈ క్రమంలో స్కీమ్‌లో పెట్టుబడి పెడితే లాభం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి పన్ను మినహాయింపు లభించే విషయం తెలిసిందే. వాత్సల్య యోజనలో చేసే పెట్టుబడులకు సైతం పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెడితే ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు.