నేర విచారణకు గవర్నర్లు అతీతులా?

నేర విచారణకు గవర్నర్లు అతీతులా?
ఎలాంటి క్రిమినల్‌ కేసులకు సంబంధించిన నేర విచారణ నుంచి అయినా గవర్నర్లకు రాజ్యాంగపరంగా రక్షణ కల్పించే రాజ్యాంగంలోని 361 అధికరణను పరిశీలించడానికి సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ తనను లైంగికంగా వేధించారంటూ రాజ్‌భవన్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 
 
తాను దీనిపై ఫిర్యాదు చేసినా గవర్నర్‌ను విచారించడం లేదని ఆమె తెలిపింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు తప్పు చేసినా ఈ అధికరణను అడ్డుపెట్టుకుని విచారణను తప్పించుకుంటున్నారని, కాబట్టి 361 ఆర్టికల్‌పై న్యాయ సమీక్ష చేయాలని, క్రిమినల్‌ కేసుల నుంచి మినహాయింపు పొందకుండా తగు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ మహిళ విజ్ఞప్తి చేసింది. 
 
ఈ కేసును విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను కోరింది. దీనిపై స్పందన తెలపాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో న్యాయస్థానానికి తమ సహాయాన్ని అందించాలని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణిని కోర్టు కోరింది. 
 
రాజ్యాంగ విధుల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి గానీ, గవర్నర్‌ గానీ ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదని, ఈ విషయంలో వారికి అధికరణ 14 నుంచి మినహాయింపు ఉంటుందని 361 అధికరణ చెబుతున్నది. బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్​పై కొన్నాళ్ల క్రితం రాజ్​భవన్​లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆమె స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.
 
ఉద్యోగం విషయంలో ప్రయోజనాలు చేకూర్చుతానన్న నెపంతో, గవర్నర్ తనను పలుమార్లు లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. అప్పట్లో ఈ ఆరోపణలు రాజకీయంగా సంచలనం రేపాయి. టీఎంసీ సర్కార్, గవర్నర్ ఆనంద్ బోస్​ల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ అప్రతిష్ఠ తెచ్చారని టీఎంసీ విమర్శించింది. సందేశ్‌ ఖాలీలో మహిళా హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తే ఇప్పుడు ఇలాంటి అవమానకరమైన చర్యలో భాగమయ్యారని దుయ్యబట్టింది.