
పార్లమెంట్ ముందుకు ఆరు కొత్త బిల్లులకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12న ముగుస్తాయి. ఇదే నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం ఒక బులిటెన్ విడుదల చేసింది. బడ్జెట్ రోజున ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉండవని పేర్కొంది. అయితే ఈ సమావేశాల్లో 90 ఏళ్ల నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టాన్ని సవరించి, దాని స్థానంలో విమానయాన రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు వీలు కల్పించే నిబంధనలతో సవరణ చట్టం తీసుకురానున్నారు.
ఈ బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం జాబితా చేసింది. విపత్తు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల మధ్య సమన్వయం, ఉమ్మడి సేవల కల్పన లక్ష్యంగా ‘ది డిజాస్టర్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు’ను కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేనున్నట్లు తెలిపింది. మిగిలిన ప్రతిపాదిత బిల్లులలో భారతీయ వాయుయన్ విధేయక్ (బివివి) బిల్లు, కాఫీ ప్రమోషన్, అభివృద్ధి బిల్లు, రబ్బరు ప్రమోషన్ అభివృద్ధి బిల్లు, బాయిలర్ల బిల్లు ఉన్నాయి.
కాగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి)ని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సుదీప్ బందోపాధ్యాయ (టిఎంసి), పిపి చౌదరి (బిజెపి), లావు శ్రీకృష్ణదేవరాయలు (టిడిపి), నిషికాంత్ దూబే (బిజెపి), గౌరవ్ గొగోరు (కాంగ్రెస్), సంజరు జైస్వాల్ (బిజెపి), దిలేశ్వర్ కమైత్ (జెడియు), భర్తృహరి మహతాబ్ (బిజెపి), దయానిధి మారన్ (డిఎంకె), బైజయంత్ పాండా (బిజెపి), అరవింద్ సావంత్ (శివసేన-యుబిటి), కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్), అనురాగ్ ఠాకూర్ (బిజెపి), లాల్జీ వర్మ (ఎస్పి) సభ్యులుగా ఉన్నారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు