
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు సహా భవిష్యత్తులో పరీక్షలు, సెలక్షన్స్ నుంచి ఆమెను ఎందుకు డిబార్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు పరిమితికి మించి రాయడంపై పూజా ఖేడ్కర్‌పై యూపీఎస్సీ మరోవంక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పుణెలో శిక్షణలో ఉండగా పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూజాపై వచ్చిన ఆరోపణలు అన్నింటిపై యూపీఎస్సీ దర్యాప్తు చేసింది.
యూపీఎస్సీ తనపై పలు చేర్యాలకు ఉపక్రమించగానే న్యాయస్థానం ద్వారా సమాధానం ఇస్తానని పూజా ఖేద్కర్ ప్రకటించారు. ఇటీవల పూణేలో శిక్షణ సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని, అధికారాలను దుర్వినియోగం చేశారనే అదనపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఖేద్కర్ మీడియాతో మాట్లాడుతూ, “న్యాయ వ్యవస్థ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటాను. ఏది ఏమైనా, నాపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇస్తాను” అని ఆమె తెలిపారు.
పూజ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలు, సంతకాలు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మార్చి తప్పుడు గుర్తింపుతో పరిమితికి మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు దర్యాప్తులో తేలింది. యూపీఎస్సీ పై ప్రజల్లో ముఖ్యంగా అభ్యర్థులకు బలమైన విశ్వాసం ఉందని, అలాంటి విశ్వసనీయతను కాపాడేందుకు కమిషన్ రాజీపడకుండా పని చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.
రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు పరీక్ష విధానాలు, నియమాలకు యూపీఎస్సీ కట్టుబడి ఉంటుందని గుర్తు చేసింది. షోకాజ్ నోటీసుపై పూజా ఖేడ్కర్ ఇచ్చే సమాధానం ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పటికే ఆమె ప్రొబేషన్ను నిలిపివేసి, ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని కూడా ఆదేశించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు