
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలుగుతున్నది. పలు కంప్యూటర్లలో విండోస్-11, విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడిచే కంప్యూటర్లు, లాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తున్నది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాతో పలు దేశాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది.
ఈ ఎర్రర్ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, స్టోరేజీ మీడియా సేవలకు అంతరాయం కలుగుతున్నది. ఈ క్రమంలో భారత్‌లో విమాన సర్వీసుల్లో అంతరాయం కలుగుతున్నది. ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్ సేవలు స్తంభించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిచిపోయింది.
ఈ క్రమంలో కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) అడ్వైజరీలో ఇటీవల మైక్రోసాఫ్ట్ క్రౌడ్‌స్ట్రయిక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్ కోసం అప్డేట్ను విడుదల చేసిందని పేర్కొంది. ఆ అప్డేట్ కారణంగా సమస్య ఏర్పడిందని సెర్ట్-ఇన్ తెలిపింది. దీని కారణంగా చాలా వ్యవస్థలు స్తంభించినట్లుగా పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం ప్రభావం మన దేశంలో స్వల్పంగా ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం తెలిపింది. 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల కార్యకలాపాలకు కాసేపు అంతరాయం కలిగిందని చెప్పింది. చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్‌లో లేవని, కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్‌ను వాడుతున్నాయంది.
అలాగే, యూఏఈకి చెందిన సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సైతం పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. మెరుగైన భద్రత కోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేయాలని సూచించింది. గూగుల్ విడుదల చేసిన కొత్త క్రోమ్ అప్డేట్ ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేయాలని చెప్పింది.
కాగా, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్‌లో ఊహించని రీతిలో జాప్యం జరుగుతున్నదని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఎయిర్‌పోర్ట్‌ల్లో అదనపు సీట్లు, మంచినీటి వసతి, ఆహారం సమకూర్చాలని ఎయిర్పోర్ట్ అధికారులు, ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు.
ప్రయాణీకుల ఇబ్బందులు అర్ధం చేసుకున్నామని, పాసింజర్లు వీలైనంత త్వరగా సురక్షితంగా ప్రయాణాలు పూర్తిచేసుకునేలా శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రయాణీకులు సంయమనంతో, ఓపికతో సహకరించిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. మ్యాన్యువల్ బ్యాకప్ సిస్టమ్స్ ద్వారా పరిస్ధితిని కొంతమేర చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు.
భారత్‌లో ఈ సాంకేతిక సమస్యల కారణంగా ఎయిర్‌పోర్టుల్లోని గ్రౌండ్ ఆపరేషన్స్ దెబ్బతిన్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహల్ చెప్పారు. పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ), పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నాయని మంత్రి తెలిపారు.
More Stories
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!