
ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత రాహుల్ గాంధీ పదేపదే కించపరిచే పదాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ కొంత పరిణితిని ప్రదర్శించాలని హితవు పలికారు. సుధాన్షు త్రివేది గురువారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రాజకీయాల్లో హింసాత్మక వాక్చాతుర్యం ప్రయోగించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య, అమెరికా అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలు అంతర్జాతీయ రాజకీయ హింసకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ పార్టీలు స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం తరచూ హింస, హత్య అనే పదాలు ఉపయోగిస్తుండటం దీర్ఘకాలంలో ఇలాంటి ఘటనలకు ప్రేరేపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నదని తెలిపారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పద ప్రయోగాలను ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత ప్రయోగించడం ఆందోళన రేకెత్తిస్తోందని త్రివేది పేర్కొన్నారు. 2021లో పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ప్రస్తావించారు.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు
కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు