
పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్ బస్టర్ ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను ఇంకా కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్లో ఎంటర్ అయినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి కర్ణుడి గెటప్‌లో ఉన్న ప్రభాస్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
చిత్రం జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచే భారీ కలెక్షన్లను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ చిత్రం రూ.1,000 కోట్ల కలెక్షన్లు దాటేసిందని మూవీ టీమ్ శనివారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా కేవలం 17 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
దీంతో తెలుగు ఇండస్ట్రీలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలలో కల్కి మూడవ సినిమాగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ పేరిటా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మైథో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రభాస్‌కు ఇది రెండో రూ.1,000 కోట్ల కలెక్షన్లు దాటిన చిత్రంగా ఉంది. బాహుబలి 2 (రూ.1,810 కోట్లు) తర్వాత ఇప్పుడు కల్కితో ఆ మ్యాజిక్ మార్క్ సాధించారు ప్రభాస్. రెండు రూ.1000 కోట్ల చిత్రాలు ఉన్న ఏకైక దక్షిణ భారత నటుడిగా ప్రభాస్ చరిత్ర సృష్టించారు. టాలీవుడ్ నుంచి రామ్‌చరణ్ (ఆర్ఆర్ఆర్), జూనియర్ ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)కు ఓ రూ.1000 కోట్ల చిత్రం ఉంది.
ఇండియాలో షారుఖ్ ఖాన్ (పఠాన్, జవాన్) తర్వాత రెండు రూ.1000 కోట్ల కలెక్షన్ల సినిమాలు ఉన్న హీరోగా ప్రభాస్ నిలిచారు. ఫుల్ రన్లో పఠాన్ (రూ.1,050 కోట్లు), జవాన్ (రూ.1,148 కోట్లు) కలెక్షన్లను కల్కి సులువుగా దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. మహాభారతం ఆధారంగా ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 ఏడీని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.
భారీగా ప్రశంసలు రావటంతో పాటు కమర్షియల్గానూ ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్ అయింది. ఇంకా జోరు చూపిస్తోంది. యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు కొత్త అనుభూతిని పంచుతుంది. చాలా కాలం తరువాత థియేటర్లు ప్రేక్షకులతో కళ కళలాడుతున్నాయి. గత కొంతకాలంగా సినిమాలు లేక, సరైన కంటెంట్‌తో సినిమాలు రాక విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతితో పాటు మంచి సినిమా చూశామన్న ఆనందాన్ని ఇచ్చింది. అందుకే ప్రేక్షకులు ఈ చిత్రానికి అత్యంత భారీ విజయాన్ని అందించారు.
ముఖ్యంగా చిత్రంలో వున్న హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, విజువల్స్ చూసి, తెలుగు సినిమా స్థాయిని ప్రశంసిస్తున్నారు. దీంతో పాటు ఈ చిత్రానికి సమయం కూడా కలిసొచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంతటి భారీ స్థాయి సినిమా రాకపోవడంతో పాటు సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీగా మారింది. సినిమాలో కీలకంగా వున్న బుజ్జి కారు, ఇలా సినిమాలో పాటు చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు అలరించే అంశాలు ఈ చిత్రంలో వుండటం కూడా మరో కారణం.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం