2060 నాటికి 170 కోట్ల‌కు భార‌త జ‌నాభా

2060 నాటికి 170 కోట్ల‌కు భార‌త జ‌నాభా

భార‌త్‌లో 2060 నాటికి దేశ జ‌నాభా సుమారు 170 కోట్లు అవుతుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నా వేసింది. ఆ త‌ర్వాత దేశ జ‌నాభా 12 శాతం ప‌డిపోతుంద‌ని పేర్కొన్న‌ది. కానీ ఈ శ‌తాబ్ధం మొత్తం ప్ర‌పంచంలో భారత్ నే అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశంగా నిలుస్తుంద‌ని యూఎన్ తెలిపింది. 2024 ప్ర‌పంచ జ‌నాభాకు చెందిన నివేదిక‌ను జూలై 11వ తేదీన రిలీజ్ చేశారు. 

రాబోయే 50 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య‌.. ప్ర‌పంచ జ‌నాభా పెరుగుతూ పోతుంద‌ని, 2080 నాటికి ఆ జ‌నాభా సుమారు 1030 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని నివేదికలో తెలిపారు. అయితే 2080 త‌ర్వాత మ‌ళ్లీ జ‌నాభా త‌రుగుద‌ల మొద‌ల‌వుతుంద‌ని, ఈ శ‌తాబ్ధం చివ‌రి నాటికి ప్ర‌పంచ జ‌నాభా 1020 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని రిపోర్టులో అంచ‌నా వేశారు.

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశంగా గ‌త ఏడాది చైనాను భారత్  దాటిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స్థాయిలోనే 2100 వ‌ర‌కు భారత్ ఉంటుంద‌ని ఐక్యరాజ్య సమితి నివేదికలో తెలిపారు. యూఎన్ పాపులేష‌న్ డివిజ‌న్‌కు చెందిన యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌నామిక్ అండ్ సొష‌ల్ అఫైర్స్ ఆ రిపోర్టును రూపొందించింది.

ఆ నివేదిక ప్ర‌కారం 2024లో భార‌త్ జ‌నాభా 145 కోట్లుగా ఉంటుంది. ఆ త‌ర్వాత 2054 నాటికి జ‌నాబా సుమారు 169 కోట్లు చేరుకుంటుంద‌ని తెలిపారు. ఇక ఆ త‌ర్వాత 2100 నాటికి, భార‌త్ జ‌నాభా 150 కోట్ల‌కు త‌గ్గుతుంద‌ని యూఎన్ అధికారి క్లారి మెనోజి వెల్ల‌డించారు. అయితే 2060 స‌మ‌యంలో మాత్రం భార‌త జ‌నాభా తారా స్థాయికి చేరుకుంటుంద‌ని, ఆ త‌ర్వాత క్ర‌మంగా త‌గ్గ‌నున్న‌ట్లు చెప్పారు.

ప్ర‌స్తుతం చైనా జ‌నాభా 2024లో 141 కోట్లుగా ఉంది. 2054 నాటికి ఈ జ‌నాభా 121 కోట్ల‌కు ప‌డిపోతుంద‌ని, ఆ త‌ర్వాత 2100 సంవ‌త్స‌రం నాటికి 63.3 కోట్ల‌కు ప‌డిపోతుంద‌ని రిపోర్టులో తెలిపారు. ప్ర‌పంచంలో రెండవ అతిపెద్ద జ‌నాభా ఉన్న దేశంగా నిలిచిన చైనాలో భారీ స్థాయిలో జ‌నాభా త‌రుగుద‌ల క‌నిపించ‌నున్న‌ది. 

2024 నుంచి 2054 మ‌ధ్య కాలంలో చైనా దేశ జ‌నాభా సుమారు 20.4 కోట్ల మేర ప‌డిపోనున్న‌ది. ఆ త‌ర్వాత స్థానాల్లో జ‌పాన్ 2.1 కోటి, ర‌ష్యా కోటి జ‌నాభా త‌గ్గ‌నున్న‌ది. ఈ శ‌తాబ్ధం చివ‌రినాటికి ఎక్కువ స్థాయిలో జ‌నాభా కోల్పోయిన‌ దేశంగా చైనా రికార్డు నెల‌కొల్ప‌నున్న‌ది. 

ప్ర‌స్తుతం ఉన్న జ‌నాభాలో సగం జ‌నాభా త‌గ్గే ప్ర‌మాదం ఉన్న‌ట్లు నివేదికలో హెచ్చ‌రించారు. ఆ దేశ జ‌నాభా దాదాపు 78 కోట్ల మేర త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయి. ఫెర్టిలిటీ రేటు త‌క్కువ ఉన్న కార‌ణంగా.. చైనా జ‌నాభా పెర‌గ‌డం అసాధ్య‌మ‌ని యూన్ అధికారి జాన్ విల్మోత్ తెలిపారు.