
పూరీ జగన్నాథుడి ఆలయ సంపదను 46 ఏళ్ల తర్వాత జులై 14 నుంచి ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో లెక్కిస్తున్నారు. అయితే, పూరీ జగన్నాథుడి రత్నభండాగారంలోని రహస్య గదిని తెరిచేందుకు సన్నద్ధమవుతోన్న అధికారులకు పాముల భయం వెంటాడుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న వారికోసం వెదుకుతున్నారు.
జగన్నాథ ఆలయ యంత్రాంగం అధికారి మాట్లాడుతూ ‘‘రత్న భాండాగారం తెరిచే సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించి, అనుమతి కోసం ప్రభుత్వానికి పంపాం. గది తెరిచే వేళ పాములు పట్టేవారు, ఓ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని కోరాం’’ అని తెలిపారు.
పూరీ జగన్నాథుడికి చెందిన వెలకట్టలేని సంపదలను ఐదు కర్ర పెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడు లేదా ఐదేళ్లకు ఒకసారి తెరిచి సంపదలను లెక్కించేవారు. చివరిసారిగా 1978లో రత్నభాండాగారం తెరిచి సంపద లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఒడిశా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశాలు వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా దీన్ని సమర్థించింది. అప్పటి నుంచి ఖజానాను తెరవలేదు. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత ఈ భాండాగారాన్ని తెరవనున్నారు.
రహస్య గదులు శిథిలావస్థకు చేరుకుని వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేపట్టాలని 2018లోనే పురావస్తు శాఖను న్యాయస్థానాలు ఆదేశించాయి. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సంపద లెక్కింపునకు 13 మందితో కూడిన అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీ 2019 ఏప్రిల్ 6న తలుపులు తెరవడానికి వెళ్లగా, రహస్య గది తాళంచెవి కనిపించకుండాపోయింది.
దీంతో సంపద లెక్కింపునకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అయితే, పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో డూప్లికేట్ తాళపుచెవి ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి, బీజేపీ ప్రభుత్వ రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. గత 46 ఏళ్లుగా రత్నభాండాగారం తలుపులు తెరవకపోవడంతో అందులో పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు.
దీంతో జగన్నాథుడి సంపద లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. ఆలయ కింది భాగంలోని రత్న భాండాగారం తెరిచిన అనంతర సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ ఓ నివేదికను అందజేయనుంది. 12వ శతాబ్ధికి చెందిన ఈ దేవాలయంలో రత్న భాండాగారంను ఇదివరకు తనిఖీ చేసినప్పుడు గోడలు, పైకప్పు బీటలు వారి ఉండటం గమనించారు.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ