ఎల్పీజీ గ్యాస్ ఆధార్-బేస్డ్ ఈ-కేవైసీ ప్రామాణీకరణ

ఎల్పీజీ గ్యాస్ ఆధార్-బేస్డ్ ఈ-కేవైసీ ప్రామాణీకరణ

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్​ వినియోగదారుల ఆధార్​-బేస్డ్​ ఈ-కేవైసీ ప్రామాణీకరణను నిర్వహిస్తున్నాయని కేంద్ర చమురు శాఖామంత్రి హర్​దీప్​​ సింగ్​ పురి స్పష్టం చేశారు. బోగస్​ గ్యాస్​ కార్డ్​లను ఏరివేయడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.  సాధారణ ప్రజలు 14.2 కిలోల వంట గ్యాస్​ (డొమెస్టిక్ ఎల్​పీజీ) సిలిండర్​ను రూ.803కు కొనుగోలు చేస్తుంటారు.

హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను రూ.1646కు కొనుగోలు చేస్తుంటాయి. దీని వల్ల వాటిపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. అందుకే కొన్ని వాణిజ్య సంస్థలు, కొందరు వ్యక్తులు బోగస్ కార్డులు సృష్టించి, వంట గ్యాస్​ సిలిండర్​లను పొందుతున్నారు. వీటిని ఏరివేయడానికే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గత 8 నెలలుగా ఈ-కేవైసీ ప్రక్రియను నిర్వహిస్తున్నాయని హర్​దీప్​ సింగ్ పురి తెలిపారు.

కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్​, ఎల్​పీజీ గ్యాస్​ ఈ-కేవైసీ ప్రక్రియ గురించి విమర్శలు చేశారు. దీని వల్ల సామాన్య వినియోగదారులు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగానే హర్​దీప్​ సింగ్ పురి తాజాగా ఎక్స్​ వేదికగా వివరణ ఇచ్చారు. ఈ-కేవైసీ ప్రక్రియ కోసం మూడు మార్గాలు ఉన్నాయి.

1వ పద్ధతి : మీకు ఎల్​పీజీ గ్యాస్​ డెలివరీ చేసే సిబ్బంది, మీ ఆధార్​ వివరాలను పరిశీలించి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఎలా అంటే? డెలివరీ సిబ్బంది తమ మొబైల్​ ఫోన్​లోని యాప్​ ద్వారా మీ ఆధార్ వివరాలు క్యాప్చర్ చేస్తారు. వెంటనే మీ రిజిస్టర్ మొబైల్​ నంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే చాలు, సింపుల్​గా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి అయిపోతుంది.

2వ పద్ధతి : వినియోగదారులే నేరుగా గ్యాస్​ డిస్ట్రిబ్యూటర్ షోరూమ్​కు వెళ్లి వారిని సంప్రదించవచ్చు. అప్పుడు వాళ్లే ఈ-కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేస్తారు.

3వ పద్ధతి : వినియోగదారులే నేరుగా చమురు కంపెనీల యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకుని, ఈ-కేవైసీ ప్రక్రియను సొంతంగా పూర్తి చేసుకోవచ్చు. వీటిలో మీకు నచ్చిన పద్ధతిలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం మంచిది.

ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి చమురు మార్కటింగ్​ కంపెనీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి గడువు విధించలేదు. కనుక వంట గ్యాస్ వినియోగదారులు భయపడాల్సిన పనిలేదు అని హర్​దీప్​ సింగ్ పురి స్పష్టం చేశారు.  కాకపోతే, బోగస్ కార్డులను ఏరివేయడానికి, నిజమైన లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, వీలైనంత త్వరగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడమే మంచిదని ఆయన సూచించారు.