ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రంగాచార్యులు రాజీనామా

ఏపీ  అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రంగాచార్యులు రాజీనామా

ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ టి. రామాచార్యులు తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం రాజ్యసభలో పనిచేసి, సెక్రటరీ జనరల్ స్థాయికి కూడా చేరుకున్న ఆయన ఉద్యోగ విరమణ తర్వాత రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వద్ద ఓఎస్డీగా పనిచేశారు. 

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసిన తర్వాత గత ఏడాది ఏపీ అసెంబ్లీలో సెక్రటరీ జనరల్ గా చేశారు. అయితే ఆయన వైసిపి ప్రభుత్వ హయాంలో చేరడంతో టిడిపి నేతలు ఆయనను ఆ పార్టీ మద్దతుదారునిగా భావిస్తూ బైటకు పంపేందుకు వత్తిడి తెస్తూవచ్చారు. పైగా ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే రిటైర్ అయినా తర్వాత కూడా ఉద్యోగాలలో కొనసాగుతున్న అధికారులు అందరిని పంపించి వేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన్ను ప్రభుత్వం సాగనంపినట్లు తెలుస్తోంది. ఇటీవల స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు బాధ్యతలు చేపట్టగానే గత ప్రభుత్వం ఈటివి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టివి5 వంటి న్యూస్ ఛానల్స్ పై అసెంబ్లీ వార్తలు కవర్ చేయకుండా విధించిన నిషేధం తొలగించాలని నిర్ణయించారు. 

అయితే, ఈ విషయంలో నిబంధనలను రంగాచార్యులు ప్రస్తావించడంతో టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దానితో స్పీకర్ వెంటనే ఆ ఫైల్ తెప్పించుకొని నిషేధం తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంలో రంగాచార్యులు సహకరించలేదని అభిప్రాయంతో అప్పటి నుండి ఆయనను పంపివేయాలను చూస్తున్నారు. దానితో ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు కూడా పంపారు.