
పాంగాంగ్ సరస్సు ఉత్తర దిక్కున పర్వతాల మధ్య సిర్జాప్ ప్రాంతంలో చైనా సైన్యం పీఎల్ఏ(ది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) ప్రధాన స్థావరం ఉంది. పాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన డ్రాగన్ సైన్యానికి అదే ప్రధాన కార్యాలయం. దానిని వాస్తవాధీన రేఖకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. అది భారతదేశ భూభాగమని భారత్ వాదిస్తోంది.
2020 మేలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20 మందికి పైగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు ముందు ఇక్కడ ఎటువంటి మానవ ఆవాసాలూ లేవు. 2021-22 మధ్యలోనే సిర్జా్పలోని స్థావరాన్ని డ్రాగన్ సైన్యం నిర్మించింది. అక్కడ ఆయుధాలు, ఇంధనం, ఇతర సామగ్రి నిల్వ చేసుకునేందుకు భూగర్భ బంకర్లు నిర్మిస్తున్న విషయాన్ని అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై సంస్థ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. తమ ఉపగ్రహాల ద్వారా రోజుకు 15 సార్లు ఫొటోలు తీయగల సామర్థ్యం ఈ సంస్థకు ఉంది.
మే 30వ తేదీన తీసిన ఫొటోలో 8 ఏటవాలు మార్గాలు ఉన్న భారీ భూగర్భ బంకర్ వెలుగులోకి వచ్చింది. దానికి సమీపంలోనే 5 ప్రవేశమార్గాలున్న మరో చిన్న బంకర్ కూడా ఉంది. ఇక్కడి ప్రధాన స్థావరం కోసం అనేక భారీ భవనాలు నిర్మించడంతోపాటు, సాయుధ వాహనాల పార్కింగ్‌కు పటిష్ఠమైన షెల్టర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
కాగా, సరిహద్దులో పరిస్థితిపై ప్రభుత్వం దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పునరుద్ఘాటించారు. పాంగాంగ్ సరస్సు వద్ద చైనా తవ్వకాలపై మీడియా కథనాన్ని ఖర్గే ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 2020 మే వరకు భారత ఆధీనంలో ఉన్న భూభాగంలో చైనా ఎలా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని ఖర్గే ప్రశ్నించారు. తాజా శాటిలైట్ చిత్రాలపై భారత సైన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా