
తెలంగాణాలో మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఫార్మ వంటి రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం రూ. 15 వేల కోట్లను కేటాయించిందని గుర్తు చేశారు. రాబోయే బల్క్ డ్రగ్ పార్కులో కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్‌ని పెంచడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
భారతీయ ఫార్మ రంగం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా ఫార్మస్యూటికల్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీం దోహదపడుతుందని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆదివారం జరిగిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఫార్మా పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్, క్వాలిటీ కంట్రోల్, అస్యూరెన్స్, మార్కెటింగ్ రెగ్యులేటరీ వంటి వివిధ విభాగాలకు ప్రాతింధ్యం వహించే 50 వేల మంది ఫార్మసీ ప్రొఫెషనల్ పాల్గొన్న ఈ సమావేశంలో తాను మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ ను ఫార్మసీ హబ్ గా మార్చిన ఫార్మా ఇండస్ట్రీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మన దేశ ఎగుమతుల్లో ఫార్మా ఉత్పత్తులే ఐదో అతి పెద్ద కమాడిటీగా ఆయన స్పష్టం చేశారు. ఎగుమతుల్లో ఐదు శాతం కన్న ఎక్కువ వాటా ఈ ఫార్మా రంగానిదేనని తెలిపారు. భారతీయ ఫార్మస్యూటికల్ ఉత్పత్తులు నాణ్యతలో, అన్ని విధాల చాలా బెస్ట్ అని ఇప్పటికే రుజువవుతున్నదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో భారతదేశం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేసి యావత్ ప్రపంచానికి అందజేసిందని గుర్తు చేశారు.
భారత దేశం దాదాపు 75 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ను 94 దేశాలకు, ఐక్య రాజ్య సమితికి చెందిన రెండు ఎంటిటీలకు అందజేయడంతో భారత్ విశ్వబంధుగా ప్రపంచంలో కీర్తి పొందిందని కొనియాడారు. అందుకే ఈ 73 వ సమావేశంలో ప్రపంచంలో భారతీయ ఫార్మా రంగం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుందని, వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఫార్మా పరిశ్రమ మద్దతు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.
More Stories
బీజేపీ నేత మధుకర్ మృతికి బాధ్యులను అరెస్ట్ చేయాలి
రెండు గంటల్లో హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం!
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!