ఇరాన్‌ నూతన అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్

ఇరాన్‌ నూతన అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్
* ప్రధాని మోదీ అభినందనలు
హెలికాప్టర్‌ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) మృతితో ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించగా ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. ఆయన తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీపై విజయం సాధించారు.
 
మసౌద్ పెజెష్కియాన్ కరడుగట్టిన ప్రత్యర్థి సయీద్ జలీలీతో జరిగిన తీవ్రమైన పోటీలో  విజేతగా ప్రకటించిన తర్వాత తన మొదటి వ్యాఖ్యలలో ఇరానియన్లందరికీ అభయ హస్తం అందిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశాడు. “మీ సాంగత్యం, సానుభూతి, నమ్మకంతో తప్ప ముందుకు సాగే కష్టమైన మార్గం సాఫీగా ఉండదు” అని పెజెష్కియాన్ శనివారం ఎక్స్ లో పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే, జలీలీ ఓటమిని అంగీకరించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎవరినైనా తప్పక గౌరవించాలని స్పష్టం చేశారు.  “ఆయనను గౌరవించడమే కాదు, ఇప్పుడు మనం మన శక్తిని ఉపయోగించాలి. బలంతో ముందుకు సాగడానికి ఆయనకు సహాయం చేయాలి” అని ఆయన రాష్ట్ర టెలివిజన్‌తో చెప్పారు. 

ఇరాన్‌ నూతన అధ్యక్షుడుమసూద్‌ పెజెష్కియాన్‌ ను భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ‘ఇరాన్‌ అధక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న మసూద్‌ పెజెష్కియాన్‌కు హృదయపూర్వక అభినందనలు’ అని మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడం కోసం ఇరాన్‌ నూతన అధ్యక్షుడితో కలిసి పనిచేస్తామని మోదీ తన పోస్టులో రాశారు.

లెక్కించిన మొత్తం 3 కోట్ల ఓట్లలో డాక్టర్ పెజెష్కియాన్‌కు అనుకూలంగా 1.6 కోట్లకుపైగా ఓట్లు ( 53.3 శాతం).. జలీలీకి 1.3 కోట్లకుపైగా ఓట్లు ( 44.3 శాతం) ఓట్లు వచ్చాయి. దాంతో పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎన్నికల విభాగం అధికార ప్రతినిధి మెహసెన్ ఇస్లామీ ప్రకటన చేశారు.

ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థినే అధ్యక్షుడిగా నియమిస్తారు. అలా రానప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్‌ఆఫ్‌ పోలింగ్‌ నిర్వహించాలి. జూన్ 28న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో కేవలం 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 

దాదాపు 60 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆ రౌండ్‌లో ఏ అభ్యర్థికి మెజారిటీ రాలేదు. దీంతో జులై 5న రెండో బ్యాలెట్‌ (రన్‌ఆప్‌ పోలింగ్‌)ను నిర్వహించారు. ఈ పోలింగ్‌లో కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాదిని ఇరానియన్లు ఎన్నుకున్నారు. ఇరాన్ అధ్యక్ష పదవికి ఓటింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది, ఇద్దరు అగ్ర పోటీదారులు మసూద్ పెజెష్కియాన్,  టెహ్రాన్, ప్రపంచ శక్తుల మధ్య జరిగిన అణు చర్చలలో ముఖ్యుడు, ప్రధాన అనుసంధానకర్త అయిన సయీద్ జలీలీ పోటీపడ్డారు.