హథ్రస్‌ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా

హథ్రస్‌ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో తీవ్ర విషాదాన్ని నింపిన తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించి 121 మంది మృతికి కారణమైన భోలేబాబా తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న అతను ఈ ఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని చెప్పాడు.
 
“ఘటన మిగిల్చిన విషాదాన్ని భరించే శక్తి దేవుడు మాకు ప్రసాదించాలి. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచండి. కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం నాకుంది. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి జీవితాంతం అండగా నిలబడాలని, వారికి సాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించాను” అని మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

మృతుల జాబితాలు తమ వద్ద ఉన్నట్లు చెబుతూ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాల పిల్లల చదువు, ఆరోగ్యం, పెళ్లి ఖర్చులను భోలే బాబాకు చెందిన నారాయణ్ సాకర్ హరి ట్రస్టే భరిస్తుందని భోలెబాబా న్యాయవాది ఏపీ సింగ్ ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎలాంటి సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో సమావేశానికి లక్షల్లో హాజరైనట్లు చెప్పారు. 80 వేలకు అనుమతి ఉండగా లక్షల్లో హాజరైనట్లు తెలిపారు. భోలే బాబా పరారీలో లేడని, విచారణకు అతను సహకరిస్తారని న్యాయవాది స్పష్టం చేశారు.

కాగా, హత్రాస్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు దేవ్‌ప్రకాశ్ మధుకర్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఈ నెల 2న హత్రాస్‌ సత్సంగ్‌ కార్యక్రమానికి దేవ్‌ప్రకాశ్‌ ఆర్గనైజర్‌గా ఉన్నాడు. తొక్కిసలాట ఘటన తర్వాత అతడు పరారయ్యాడు. అప్పటినుంచి తప్పించుకుతిరుగుతున్న ఆయన తాజాగా ఢిల్లీలో పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం అతడిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారని దేవ్‌ప్రకాశ్‌ తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

“హత్రాస్ సత్సంగ్‌కి దేవ్‌ప్రకాశ్ ప్రధాన నిర్వాహకుడిగా ఉన్నాడు. మధుకర్ ఏ నేరం చేయలేదు. అందుకే పోలీసుల ముందు లొంగిపోయాడు. అతనికి హృదయ సంబంధిత వ్యాధులున్నాయి. దేవ్ ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది. అందుకే విచారణ నిమిత్తం లొంగిపోయాడు. ముందస్తు బెయిల్​ కోసం మేం కోర్టుకి వెళ్లం. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాం” అని న్యాయవాది ఏపీ సింగ్ వివరించారు.