అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన యాత్రికులు

అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన యాత్రికులు
అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. జూన్ 29 వ తేదీన ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు రోజూ వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని ఆ మంచు శివలింగం దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత అమర్‌నాథ్ గుహలో కొలువైన మంచు శివ లింగాన్ని సందర్శించే వారి సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోల్చితే ఈసారి యాత్రికుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. యాత్ర ప్రారంభం అయిన వారం రోజుల్లోనే లక్షన్నర మంది యాత్రికుల కంటే ఎక్కువ మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు.  అమర్‌నాథ్ యాత్ర గత నెల 29 వ తేదీన ప్రారంభం కాగా.. ఈ నెల 4 వ తేదీ వరకు కేవలం 6 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,30,260 మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. 
 
ఇక ఇందులో గురువారం ఒక్క రోజే ఏకంగా 24 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు బుధవారం 30 వేల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారు.  ఇక శుక్రవారం ఉదయం అమర్‌నాథ్ యాత్రలో భాగంగా 8 వ బ్యాచ్‌ ప్రారంభమైంది.
 
 6919 మంది యాత్రికులు జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్, అనంత్‌నాగ్ జిల్లాలోని నున్వాన్- పహల్గామ్ జంట బేస్ క్యాంపుల వైపు పటిష్ఠ భద్రత మధ్య బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో ఈసారి అమర్‌నాథ్ యాత్ర కొనసాగే మార్గాల్లో అడుగడుగున భారీగా భద్రతా దళాలను మోహరించారు. 
 
ఈ ఏడాది జూన్ 29 వ తేదీన ప్రారంభమైన ఈ అమర్‌నాథ్ యాత్ర ఆగస్ట్ 19 వ తేదీన ముగియనుంది. అంటే మొత్తం 52 రోజుల పాటు అమర్‌నాథ్ గుహలో యాత్రికులకు మంచు శివలింగం దర్శనం ఇవ్వనుంది. గతేడాది అమర్‌నాథ్ యాత్రలో భాగంగా 4.5 లక్షల మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 
 
అయితే ఈసారి అంతకంటే ఎక్కువ మంది అమర్‌నాథ్ యాత్రకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నా.. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు భక్తులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కుండపోత వానల్లోనే బేస్ క్యాంపుల నుంచి బయల్దేరుతున్నారు.