దేశ ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు

దేశ ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశ ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సుస్థిరత, నిజాయతీని నమ్మారని పేర్కొంటూ పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని తెలిపారు.  కొత్తగా కొలువుదీరిన 18వ లోక్‌సభతో పాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ప్రసంగించారు. 
 
మూడోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన భారత ఎన్నికల సంఘానికి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు’ అని రాష్ట్రపతి తెలిపారు.  `ప్రజలు నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి’ అంటూ ఆమె అభిలాషను వ్యక్తం చేశారు.
 
జమ్ముకశ్మీర్​పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతూ అయితే ఈ సారి కశ్మీర్‌ లోయలో మార్పు కన్పించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. శుత్రువులకు గట్టిగా బదులిస్తూ జమ్ముకశ్మీర్‌ ప్రజలు పెద్దసంఖ్యలో ఓటింగ్​లో పాల్గొన్నారని రాష్ట్రపతి కొనియాడారు.
 
‘రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ (సంస్కరణలు, పనితీరు, మార్పు) ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది’ అని రాష్ట్రపతి చెప్పారు. 
 
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని, పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని, మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని ఆమె కొనియాడారు. మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, పౌరవిమానాయాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని ఆమె వివరించారు.
 
ఇటీవల నీట్‌ యూజీ, నెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాల గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్‌, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.

సేంద్రీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ప్రపంచవ్యాప్త డిమాండ్‌ మేరకు భారత్‌ ఉత్పత్తులు అందిస్తోందని చెప్పారు. ఆరోగ్యరంగంలో భారత్‌ అగ్రగామిగా ఉందని, వేగంగా పురోగతి సాధిస్తోందని రాష్రపతి పేర్కొన్నారు.

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కోసం పీఎం సమ్మాన్‌ నిధి ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. గ్రామీణ సడక్‌ యోజన కింద గ్రామాల్లో రోడ్ల విస్తరణ వేగంగా జరుగుతున్న్టుల చెప్పారు. పౌర విమానయాన రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఆయా రాష్ట్రాల మధ్య కనెక్టివిటి పెరిగినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.

డిజిటల్‌ ఇండియా సాధనకు తమ ప్రభుత్వం సంకల్పించినట్లు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తెలిపారు. ‘బ్యాంకుల క్రెడిట్‌ బేస్‌ పెంచి వాటిని బలోపేతం చేశారు. డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరిగాయి. సైనికదళాల్లో స్థిరమైన సంస్కరణల కారణంగా బలగాలు స్వయం సమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయటం, సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.

తొలుత రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌ చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్వాగతం పలికారు.