
రెండు కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరు కాగా, మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయన్ను తీసుకెళ్లారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు, అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్‌పై దాడి చేశారు.
అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైనా దాడికి యత్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతోపాటు అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో ఇన్నాళ్లు అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా, ఇప్పటికీ మూడు సార్లు వాటిని పొడిగించారు. ఈ వెసులుబాటు గడువు ముగియడంతోపాటు ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
దీంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పటిష్ఠ బందోబస్తు మధ్య మాచర్ల కోర్టుకు తరలించారు. ఇరువైపుల వాదనల విన్న న్యాయమూర్తి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మాచర్ల తరలించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అటు పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్లలో తెలుగుదేశం నేతలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోర్టు వద్దకు పెద్దఎత్తున చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం