చంద్రయానంలో చైనా ప్రపంచ రికార్డు

చంద్రయానంలో చైనా ప్రపంచ రికార్డు

చంద్రయానంలో చైనా ప్రపంచ రికార్డు సృష్టించింది. చాంగే -6 చంద్రుని ఆవల ఉపరితలంపై నుండి రాళ్లు, మట్టి నమూనాలను తీసుకుని భూమిపైకి వచ్చింది. ఈ నౌక మంగళవారం మధ్యాహ్నం ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగోలియన్‌ ప్రాంతంలో దిగినట్లు అధికారులు తెలిపారు.  మే 3న చాంగే-6ను చైనా ప్రయోగించింది. 53 రోజులు ప్రయాణించి అది చంద్రుని చేరింది.

కోర్‌లో ప్రాంతంలో డ్రిల్ చేసి ఉపరితలం నుంచి రాళ్లను సేకరించింది. గతంలోనూ చైనా చాంగే-5 ప్రోబ్‌ను పంపి చంద్రుని సమీప వైపు నుంచి చైనా నమూనాలను సేకరించింది.  ఈ నౌక చంద్రుని ఉపరితంలపై డ్రిల్‌ చేసి మట్టిని, రాళ్లను సేకరించింది. 25 లక్షల ఏళ్ల నాటి అగ్నిపర్వత శిలలు, ఇతర పదార్థాలు ఈ నమూనాల్లో ఉండవచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

దీంతో చంద్రుని రెండు వైపుల ఉన్న భౌగోళిక వైవిధ్యాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని భావిస్తున్నారు.  చంద్రుని ఆవలివైపున అగ్నిపర్వత శిలలు, క్రేటర్‌లు ఉంటాయని ఇప్పటికే స్పష్టమైంది. చంద్రుని పుట్టుక, ఉల్కాపాతం వంటి ఎన్నో పరిశోధనలకు ఈ నమూనాలు కీలకం కానున్నాయి. గతంలో అమెరికా, సోవియట్‌ రష్యాలు చంద్రుని ఇవతలి వైపు నుండి నమూనాలను సేకరించాయి. 

ఇటీవలి సంవత్సరాలలో చైనా చంద్రునిపై అనేక విజయవంతమైన మిషన్‌లను ప్రారంభించింది. గతంలో చాంగ్‌ -5 రోదసీ నౌకతో చంద్రుని ఇవతలి వైపు నమూనాలను సేకరించింది.  అయితే చంద్రుని ఆవలివైపు నమూనాలు సేకరించిన మొదటి దేశంగా చైనా నిలిచింది. భూమికి కనిపించే చంద్రుని భాగాన్ని నియర్‌ సైడ్‌ అని, ఆవలి వైపు భాగాన్ని ఫార్‌ సైడ్‌ అని పేర్కొంటారు.

ఇవతలి వైపు చదునుగా కనిపించినప్పటికీ.. చంద్రుని ఆవలి వైపు పర్వతాలు, బిలాలతో నిండి వుంటుంది. చంద్రుని రెండు వైపుల గల వైవిధ్యానికి ఏ భౌగోళిక కార్యాచరణ బాధ్యత వహిస్తుందన్న లూనార్‌ రీసెర్చ్‌లోని ప్రధాన ప్రశ్నకు ఈ నమూనాలు సమాధానమిచ్చే అవకాశం ఉందని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో జియాలజిస్ట్‌ జోంగ్యు యుయె తెలిపారు. 

చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ భాగస్వామ్యంతో సోమవారం ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. గతంలో చంద్రుని ఉల్క ఢీ కొట్టిన జాడలకు సంబంధించిన నమూనాలను కూడా ఈ నౌక తీసుకురావచ్చని భావిస్తున్నారు.