కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
తన బెయిల్‌పై డిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్‌, సీఎం కేజ్రీవాల్‌కు ఊరట మాత్రం దక్కలేదు. కేజ్రీవాల్ పిటిషన్‌ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌‌తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది. అయితే అప్పటి వరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తామని స్పష్టం చేసింది.

మార్చి 21వ తేదీన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఇటీవల ఢిల్లీలోని ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు‌ను ఈడీ ఆశ్రయించింది. 

ఆ క్రమంలో తమ వాదనలు పూర్తిగా వినకుండానే ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిందంటూ ఢిల్లీ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు పూర్తిగా వినాలని.. అలాగే కేజ్రీవాల్ బెయిల్ రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో ఈడీ స్పష్టం చేసింది.  ఈ పిటిషన్‌పై రెండు మూడు రోజుల్లో స్పందిస్తామని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. 

అయితే అప్పటి వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌‌పై స్టే విధిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  బెయిల్‌పై స్టే మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. 

విచారణ తొలి రోజే బెయిల్‌ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని ప్రశ్నించారు. హైకోర్టు తన ఉత్తర్వులు వెలువరించేంత వరకూ సీఎం ఎందుకు స్వేచ్ఛగా ఉండరాదని అడిగారు. సీఎంకు అనుకూలంగా బెయిల్‌ ఉత్తర్వులు ఉన్నాయని, ఆయన విదేశాలకు పారిపోయే ప్రమాదం కూడా లేదని వివరించారు.

అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తామని.. అలాగే జూన్ 26వ తేదీన ఈ పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. దాంతో సుప్రీంకోర్టులో సైతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కనట్లు అయింది.