ప్రాసెస్డ్‌ ఫుడ్‌, అధిక ఒత్తిడితో పెరుగుతున్న కాన్సర్ కేసులు

ప్రాసెస్డ్‌ ఫుడ్‌, అధిక ఒత్తిడితో పెరుగుతున్న కాన్సర్ కేసులు

ప్రాసెస్డ్‌ ఫుడ్‌, అధిక ఒత్తిడితో కూడిన అనారోగ్యకరమైన జీవన శైలితో భారత్‌లో 40 ఏళ్లలోపు వారిలో కేన్సర్‌ కేసులను పెంచుతున్నాయని వైద్యులు పేర్కొన్నారు. కదలకుండా ఎక్కువ సేపు కూర్చుని ఉండటం కూడా భారత్‌లో యువకులు కేన్సర్‌ బారినపడేలా చేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. 

ఢిల్లీకి చెందిన కేన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌ ఇటీవల ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వే ప్రకారం భారత్‌లో ప్రస్తుతం 40 ఏళ్లలోపు వారిలో 20 శాతం కేన్సర్‌ కేసులు నిర్థారణ అవుతున్నాయని పేర్కొంది. పురుషులు 60 శాతం ఉండగా, మిగిలిన 40 శాతం కేసుల్లో మహిళలు ఉన్నారని తెలిపింది.

ప్రాసెస్డ్‌ ఫుడ్‌, పొగాకు, ఆల్కహాల్‌ను అధికంగా తీసుకోవడం, ఊబకాయం, ఒత్తిడి, ఎక్కువసేపు కూర్చుని ఉండటం ప్రధాన కారణాలలో ఒకటని పేర్కొన్నారు. వీటికి తోడు పర్యావరణ కాలుష్యం మరో క్లిష్టమైన అంశమని చెప్పారు. భారత్‌లోని పలు నగరాలు అధికస్థాయిలో కాలుష్యంతో నిండిపోయాయని, ఈ పరిస్థితులు వివిధ రకాల కేన్సర్‌ కేసులో ముడిపడి ఉన్నాయని అన్నారు. గాలి, నీటి కాలుష్యం కేన్సర్‌ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయని అన్నారు.

అనారోగ్యకరమైన, యాడెడ్‌, ప్రిజర్వేటివ్స్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఆరోగ్యంపై అధిక ప్రభావాన్ని చూపుతున్నాయని ఫోర్టీస్‌ మెమోరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో హెమటాలజీ, బిఎంటి డైరెక్టర్‌ మరియు హెడ్‌ డా.రాహుల్‌ భార్గవ పేర్కొన్నారు. ఈ భయంకరమైన ధోరణిని అరికట్టడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చురుకైన జీవన శైలిని ప్రారంభించడం అత్యవసరమని అన్నారు.