తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్

తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్
తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచిస్తోందని, అక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి వెల్లడించారు.
 
బసవతారకం ఇండో అమెరికన్​ క్యాన్సర్​ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని  చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా  హైదరాబాద్ కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. 
 
ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుందని తద్వారా సంస్థ విస్తరణకు అవకాశం ఉంటుందని తెలిపారు.  ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ ఈ ఆసుపత్రి 24ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.   పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారని కొనియాడారు.
 
అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పని చేసే అవకాశం తనకు వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొంటూ అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.   చంద్రబాబు 18 గంటలు పని చేసి, తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
 
క్యాన్సర్​ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోందని అధ్యక్షత వహించిన బసవతారకం హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం సహకారం కోరగానేఅంగీకారం తెలిపారని వివరించారు. దాతల సహకారంతో ఆసుపత్రి నేడు ఈ స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి సేవలను మరింత విస్తరిస్తామని బాలకృష్ణ తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పాల్గొన్నారు.