ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్

ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికింది. రూ.1 లక్ష పూచీకత్తుతో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం తీర్పును ఇచ్చింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 15 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్‌ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. 
 
ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో గతంలోనే రెగ్యులర్ బెయిల్‌ కోసం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం, గురువారం సుదీర్ఘ వాదనలు జరగ్ వాటన్నింటినీ పరిశీలించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఈడీ అధికారులు ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ లంచంగా రూ.100 కోట్లను డిమాండ్‌ చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చడాన్ని ఈడీ సమర్ధించుకుంది. 

కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ గడువు ముగియడంతో బుధవారం ఆయనను ఈడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్‌పై ఈడీ, కేజ్రీవాల్ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు.
 
 ఆప్‌కు నిధుల కోసం రూ.100 కోట్లు ఇవ్వాలని.. అరవింద్ కేజ్రీవాల్‌ లంచం కింద.. సౌత్‌గ్రూప్‌ను డిమాండ్‌ చేశారని ఈడీ ఆరోపించింది. హవాలా రూపంలో రూ.100 కోట్లు గోవాకు చేరినట్లు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఖండించారు. కేవలం ఇతర నిందితులు చెప్పారని ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఎటువంటి ఆధారాలు చూపించలేక పోతున్నారని స్పష్టం చేశారు.
 
కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేయడం పట్ట ఆప్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై బాణాసంచ కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.  సత్యమే గెలిచిందని చెబుతూ “సత్యానికి కొన్నిసార్లు ఇబ్బందులు రావొచ్చేమో గానీ, ఓటమి మాత్రం ఉండదు” అని  ఆప్‌ నేత, డిల్లీ మంత్రి అతిశీ తెలిపారు.
 
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21 వ తేదీన కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన కేజ్రీవాల్.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. అనంతరం 15 రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలకు ముందు జూన్ 2 వ తేదీన తిరిగి తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.