
పొరుగున ఉన్న దేశాలతో కయ్యానికి కాలు దువ్వడం చైనాకు అలవాటే. పొరుగున ఉన్న భారత్, తైవాన్, భూటాన్ సహా వివిధ దేశాలతో ఘర్షణలకు కాలుదువ్వడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిలిప్పీన్స్ నేవీపై డ్రాగన్ సైనికులు భీకర దాడికి దిగింది. గతంలో భారత సైన్యంపై గల్వాన్ లోయలో పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లుగానే ఈసారి దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ బలగాలు దాడికి తెగబడ్డాయి.
ఫిలిప్పీన్స్ నేవీ పడవలపై కత్తులు, గొడ్జళ్లు, సుత్తెలతో దాడులు చేశాయి. ఈ ఘటన చైనా, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య తాజాగా పెను దుమారాన్ని రేపింది. ఫిలిప్పీన్స్ నేవీకి చెందిన పడవలపై చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ బలగాలు దాడులు చేశాయి. ఫిలిప్పీన్స్ పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయి.
దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ నేవీకి చెందిన రెండు పడవలు సెకండ్ థామస్ షోల్‌కు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్లు ఫిలిప్పీన్స్ నేవీ అధికారులు వెల్లడించారు. మొదట చైనా బలగాలు ఫిలిప్పీన్స్ దళాలతో ఘర్షణకు దిగాయి. ఆ తర్వాత మరింత బరితెగించి ఫిలీప్పీన్స్ పడవల్లోకి దిగిన చైనా సైన్యం దాడికి తెగబడింది.
ఫిలిప్పీన్స్ పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎం4 రైఫిల్స్‌ను చైనా సైనికులు దొంగిలించారు. వాటితోపాటు అక్కడే ఉన్న నేవిగేషన్ డివైజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్ నేవీకి చెందిన కొందరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక సైనికుడికి బొటనవేలు తెగిపోయింది. ఇక ఫిలిప్పీన్స్‌కు చెందిన 2 పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టి అడ్డగించాయి.
ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రవ్నెర్ జూనియర్ ఈ దాడిని సముద్ర దాడిగా అభివర్ణించారు. చైనా సైన్యాన్ని సముద్రపు దొంగలతో పోల్చారు. చైనా కోస్ట్‌గార్డ్ వద్ద పదునైన ఆయుధాలున్నాయని, వారు దాడి చేసినపుడు ఫిలిప్పీన్స్ సైనికులు కేవలం చేతులతో పోరాడినట్లు తెలిపారు. తమ పడవల్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పరికరాలను వెంటనే తిరిగివ్వాలని డిమాండ్ చేశారు.
చైనా సైన్యం తమకు చేసిన నష్టానికి పరిహారం కూడా చెల్లించాలని ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ డిమాండ్ చేశారు. చైనా సైన్యంతో పోల్చితే తమ బలగాలు తక్కువ మందే ఉన్నా ధైర్యంతో పోరాడినట్లు తెలిపిన ఆయన వారి తెగువను కొనియాడారు. యుద్ధం రాకుండా చూడాలన్నది తమ లక్ష్యమని వెల్లడించారు. అయితే, చైనా కోస్ట్‌గార్డ్ దళాలు చట్టపరమైన చర్యలు తీసుకొని ఫిలిప్పీన్స్ పడవలో అక్రమ ఆయుధాల సరఫరాను అడ్డుకున్నాయని చైనా విదేశాంగశాఖ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఫిలిప్పీన్స్ సైనికులపై ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
గత శనివారం చైనా తమ కోస్ట్‌గార్డ్ చట్టంలో కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. దాని ప్రకారం సముద్రాల్లో ఉండే సరిహద్దులను దాటే విదేశీయులను చైనా బలగాలు పట్టుకుని నెల రోజుల నుంచి 2 నెలల పాటు నిర్బంధించే అవకాశం కల్పించింది. ఈ కొత్త నిబంధనతోనే తాజాగా చైనా సైన్యం దాడి చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇప్పుడు వాటిల్లోకి వచ్చే సమీప దేశాల సిబ్బందిని బంధించేందుకు చట్టంలో కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఇక ఇటీవలే ఫిలిప్పీన్స్ నౌకను చైనా నౌక ఢీకొట్టడం గమనార్హం.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు