ఒడిశా సిఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం

ఒడిశా సిఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం

ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. యనతో పాటు డిప్యూటీ సీఎంలుగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బొలంగీర్ రాజ వంశానికి చెందిన కనక్‌ వర్ధన్‌ సింగ్‌దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరీదాలతో గవర్నర్ ప్రమాణం చేయించారు.

ప్రవతి పరీదా ఒడిశాకు తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి. గతంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత హేమానంద బిస్వాల్, గిరిధర్‌ గమాంగ్‌‌లు ఒడిశా సీఎంలుగా వ్యవహరించారు. వారి తర్వాత ఇప్పుడు మాఝి సీఎం అయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు.

భువనేశ్వర్ లోని జనతా మైదాన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో  కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, అశ్విని వైభవ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, హర్యానా సీఎం నయబ్ సింగి సైని, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, త్రిపుర సీఎం మానిక్ సహా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరయ్యారు.

మాఝీ ఆహ్వానం మేరకు బిజూ జనతాదళ్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు. అంతకు ముందు విలేఖరులతో కొత్త ముఖ్యమంత్రి మాఝీ మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను వందరోజుల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో 24 ఏళ్లుగా పాలిస్తున్న బిజూ జనతాదళ్ ప్రభుత్వం పరిసమాప్తమైంది. మొత్తం 147 స్థానాలకు బీజేపీ 78 స్థానాలనే సాధించగలిగింది. బీజేడీ 51 స్థానాలను, కాంగ్రెస్ 14 , సిపిఎం ఒకటి, ఇండిపెండెంట్లు మూడు స్థానాలను గెలుచుకున్నారు.

ఇక, ఒడిశా సీఎంగా బాధ్యతలు చేపట్టిన గిరిజన నేత మోహన్‌ చరణ మాఝి.. సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన మాఝి.. విద్యార్ధి దశ నుంచే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. సరస్వతి విద్యా మందిర్‌లో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత లాయర్‌గా పనిచేశారు.

1997 నుంచి 2000 వరకు సర్పంచిగా, బీజేపీ గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శిగా మాఝి ఉన్నారు. కేంఝార్‌ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు (2000, 2009, 2019, 2024) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకు శాసనసభలో బీజేపీ సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్‌ విప్‌గా విధులు నిర్వహించారు.