కువైట్ లో ఐదుగురు భారతీయులు సహా 41 మంది సజీవ దహనం

కువైట్ లో ఐదుగురు భారతీయులు సహా 41 మంది సజీవ దహనం
కువైట్‌ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో పై అంతస్తు వరకూ వ్యాపించాయి. 
 
మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో అందులో నివసిస్తున్న వారు బయటకు వచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పటివరకూ 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు కువైట్‌ మీడియా తెలిపింది.
 
తెల్లవారుజామున మొదలైన మంటలు వేగంగా భవనం అంతటా వ్యాపించి లోపల ఉన్న పలువురిని చుట్టుముట్టి, క్షణాల్లో సజీవ దహనం చేశాయి. ఈ ఘటనలో 41 మంది మృతి చెందినట్లు కువైట్ ఉప ప్రధాని తెలిపారు.

‘అగ్నిప్రమాదం సభవించిన భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉంటున్నారు. ఘటన అనంతరం చాలా మందిని రక్షించాం. కానీ దురదృష్టవశాత్తూ మంటల ధాటికి పొగ పీల్చడం వల్ల చాలా మంది మరణించారు’ అని సీనియర్‌ పోలీస్‌ కమాండర్‌ ఒకరు తెలిపారు. సుమారు 50 మందిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సదరు కమాండర్‌ వెల్లడించారు.

ఈ అగ్నిప్రమాదంలో కేరళకు చెందిన ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో కేరళ, తమిళనాడులకు చెందిన కార్మికులు సహా మొత్తం 195 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ భవనం మలయాళీ వ్యాపారవేత్త కేజీ అబ్రహంకు చెందిన ఎన్బీటీసీ గ్రూప్ నకు చెందినది.  ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్ లోని భారత రాయబారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన భారతీయులకు అవసరమైన సాయం చేయాలని ఆదేశించారు.

‘‘కువైట్ నగరంలో జరిగిన అగ్నిప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. 40 మందికి పైగా మరణించగా, 50 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మా అంబాసిడర్ క్యాంపుకు వెళ్లాడు. మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం’ అని జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో సంబంధిత వారందరికీ తమ రాయబార కార్యాలయం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.

మంటలు అదుపులోకి వచ్చాయని, అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆధారాల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని కువైట్ ప్రభుత్వం తెలిపింది. అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని కార్మికుల వసతి కోసం ఉపయోగించారని, అక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారని వెల్లడించింది. ‘‘ఈ  ప్రమాదంలో చిక్కుకున్న చాలామందిని రక్షించారు, కానీ దురదృష్టవశాత్తు మంటల నుండి పొగ పీల్చడం వల్ల చాలా మంది మరణించారు’’ అని సీనియర్ పోలీసు కమాండర్ చెప్పారు.