
సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ‘మోదీ కా పరివార్’ను తొలగించాలని దేశ ప్రజలందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు విజ్ఞప్తి చేశారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే విజయం సాధించడం ద్వారా సమర్ధవంతంగా సందేశం వెళ్లిందని తెలిపారు.
ప్రధానమంత్రికి సొంత కుటంబం లేదంటూ ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ గత మార్చిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో మోదీకి సంఘీభావం వెల్లువెత్తింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తమ పేర్లకు ముందు ‘మోదీ కుటుంబం’ అని రాసుకున్నారు.
ఎన్నికలు పూర్తికావడం, మూడోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ పదవీ బాధ్యతలు చెప్పడటంతో సోషల్ మీడీయా వేదికల నుంచి “మోదీ కా పరివార్”ను తొలగించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
”నామీద అభిమానంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దేశవ్యాప్తంగా ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాలలో ‘మోదీ కా పరివార్’ అని రాశారు. ఇది నాకెంతో బలాన్ని ఇచ్చింది. ప్రజలు మూడోసారి ఎన్డీయేకు మెజారిటీ ఇచ్చారు. ఇదొక రికార్డు. దేశ అభివృద్ధిని కొనసాగించాలనే బలమైన సందేశం మాకు అందింది” అని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో తెలిపారు.
మనదంతా ఒకే కుటుంబం అంటూ ప్రజలిచ్చిన సందేశం అందరికీ చేరిందని, అదే కృతజ్ఞతతో మీ సోషల్ మీడియా ఖాతాల నుంచి దానిని ఇప్పుడు తొలగించాలని కోరుతున్నానని చెప్పారు. డిస్‌ప్లేలో పేరు మారినా భారతదేశ ప్రగతి కోసం ప్రయత్నిస్తున్న కుటుంబంగా మన బంధం విడదీయరానిదని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?