పిఠాపురం వర్మ కారుపై జనసైనికుల రాళ్ల దాడి

పిఠాపురం వర్మ కారుపై జనసైనికుల రాళ్ల దాడి
పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ కారుపై దాడి కలకలంరేపింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో ఓ కార్యక్రమానికి వర్మ వెళ్లారు. అక్కడ రాళ్లతో దాడి జరగ్గా వర్మ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
 
 పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించిన వారందరికీ
వర్మ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్మ పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వర్మ శుక్రవారం రాత్రి గొల్లప్రోలు మండలం వన్నెపూడి వెళ్లి సర్పంచ్‌ కందా సుబ్రహ్మణ్యంను కలిసి మాట్లాడారు. 
 
ఆ తర్వాత తిరిగి వచ్చి కారు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా కొందరు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడి చేసింది. ఆరు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి నుంచి జనసేన పార్టీలోకి వెళ్లిన 25 మంది చేసిన పని అని వర్మ చెబుతున్నారు. జనసేన పార్టీతో తనకు ఎలాంటి ఇబ్బందిలేదని,  పవన్ కళ్యాణ్‌ ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నానని, పవన్ కళ్యాణ్‌తో కలిసి కుటుంబసభ్యుల్లా ఎన్నికల్లో పనిచేశామని స్పష్టం చేసేటున్నారు.
 
టీడీపీ నుంచి 6 నెలల క్రితం జనసేన పార్టీలోకి వెళ్లిన 25మంది ఉన్నారని.. ఇదంతా వారు చేసిన పనిగా వర్మ ఆరోపించారు. తనను చంపడానికే ఈ కుట్ర జరిగిందని, ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. టీడీపీ నుంచి వెళ్లిన వాళ్లే ఇలా చేశారని, దీనిపై పవన్ కళ్యాణ్‌కు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయనని చెప్పారు. వీరంతా కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ గ్రూప్ అని పేర్కొన్నారు.
 
ఈ దాడితో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌కు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న జనసేన నేతలు, జనసైనికులకు సంబంధం లేదని వర్మ స్పష్టం చేశారు. ఎవరైతే వైఎస్సార్‌సీపీ వారని చెప్పి టీడీపీ వారిని చేర్చుకున్నారో వారు చేసిందే అని తెలిపారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  పిఠాపురం టికెట్ ను జనసేన కోసం వర్మ త్యాగం చేశారు. ఈ సీటు నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.