తెలంగాణాలో బీఆర్ఎస్‌ ఉనికి కోల్పోయింది

తెలంగాణాలో బీఆర్ఎస్‌ ఉనికి కోల్పోయింది

బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, హస్తం పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు  జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. తాజా ఎన్నికలతో రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పార్టీ ఉనికి కోల్పోయిందని ఆయన దుయ్యబట్టారు.

రాష్ట్రంలో గడిచిన ఆర్నెళ్లలోనే ప్రజల్లో కాంగ్రెస్‌ సర్కార్‌ నమ్మకం కోల్పోయిందని, కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అనేక మందితో అక్రమంగా వేల కోట్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో బీజేపీ ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొన్న తరుణంలో ప్రజలు బీజేపీని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారని, తాజా ఫలితాలే అందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్డీఏ విజయం పట్ల కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీపై విశ్వాసం ఉంచి, అధికస్థానాల్లో కమలం పార్టీని గెలిపించారని ఆయన పేర్కొన్నారు.

బీజేపీకి తెలంగాణ ప్రజలు 35 శాతానికిపైగా ఓట్లు వేశారని, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభలో కాంగ్రెస్‌కు ఒక్కశాతం ఓటింగ్‌ పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో చాలా చోట్ల బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రాలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలబడ్డారని, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేశారని చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలిచిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.  గతంలో రేవంత్‌రెడ్డి గెలిచిన మల్కాజిగిరిలో కూడా బీజేపీ గెలిచిందని, కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, సిద్దిపేట ఉన్న మెదక్‌ను బీజేపీ గెలిచిందని తెలిపారు.  ఏపీలో అద్భుతమైన మెజార్టీతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని, ఎన్డీఏ విజయానికి సహకరించిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.