ఎన్డీఏతోనే తమ పయనమని స్పష్టం చేసిన చంద్రబాబు

ఎన్డీఏతోనే తమ పయనమని స్పష్టం చేసిన చంద్రబాబు
తాము ఎన్డీఏలోనే ఉన్నామని, దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలను చూశానని, ఎన్డీఏ సమావేశానికి తాను వెళుతున్నానని ఎలాంటి సందేహాలు వద్దని ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెబుతానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమితోనే తమ రాజకీయ పయనం కొనసాగుతుందని ఢిల్లీ వెళ్లేముందు  చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.

ఏపీలో ఎంత మేరకు విధ్వంసం జరిగిందో తరచి చూస్తే తప్ప లోతు తెలియదని ఎన్నికల్లో భారీ విజయం తర్వాత తొలి సారి మీడియా సమావేశంలో తెలిపారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ వెళుతున్నట్టు చెబుతూ  ఏపీలో మీడియాకు స్వాతంత్య్రం వచ్చిందని, ఆ తర్వాత ప్రజలకు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఢిల్లీ వెడుతూ మీడియా, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నానని చెప్పారు. సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని,  ఒక రంగం, వ్యవస్థ కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో అన్నీ చూశామని ఆయన గుర్తు చేశారు.

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దీని కోసం ఎన్ని త్యాగాలైనా చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్ కోసం ముందుకు వెళ్లినట్టు చెప్పారు. పదో ఎన్నికను చూశానని, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళామని చెప్పారు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, అధికారం అశాశ్వతం అంటూ ఎన్నో పార్టీలు, వ్యక్తులు కనుమరుగైపోతాయని గుర్తు చేశారు.

ఇం తచారిత్రకమైన ఎన్నికలను ఎప్పుడు చూడలేదని అంటూ ఎన్నికల్లో వ్యతిరేకత కనిపించిందని, అమెరికాలో ఉండే వ్యక్తి కూడా ఐదారు లక్షలు ఖర్చు చేసి ఓటు వేయడానికి వచ్చారని, కడుపు నింపుకోడానికి పక్క రాష్ట్రాలకు వెళ్లిన వారు నేరుగా సొంత డబ్బులతో వచ్చారని వివరించారు. భోజనాలు ప్యాక్‌ చేసుకుని ఓట్లు వేయడానికి వచ్చారని, ఆ కమిట్‌మెంట్‌ను ఎలా అభినందించాలో తెలియడం లేదని తెలిపారు. 

టీడీపీ చరిత్రలో, ఏపీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన చరిత్ర అంటూ 83లో గెలిస్తే 200సీట్లు వచ్చాయని, 94లో ప్రజా వ్యతిరేకత, ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల అపోజిషన్‌ స్టేటస్ లేకుండా సీట్లు వచ్చాయని, ఈసారి మాత్రం ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని వివరించారు. దానికి కారణాలు అనుభవించిన ప్రజలకు తెలుసన్నారు. 

ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కును కోల్పోయారని, బతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ కోల్పోయారని, ఎన్నికల్లో ఎలా కలిశామో ప్రజలకు తెలుసని చెబుతూ  ప్రతి సందర్భంలో బహిరంగ వేదికపై ప్రజలు గెలవాలన్నదే తమ అకాంక్ష అని గుర్తు చేశారు.

కూటమికి 55.38శాతం, 45.60శాతం టీడీపీకి, వైసీపీ 39.37శాతం ఓట్లు పడ్డాయని చంద్రబాబు చెప్పారు. ఒక్కో చోట 95వేల మెజార్టీ వచ్చిందని, మంగళగిరిలో 91వేల మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. ప్రజల తీర్పు, అహంకారం నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదనుకుంటే అది చేస్తామంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.

ప్రజల గుణపాఠం, అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి విధ్వంసకారులకైనా ఇదే గుణపాఠమని స్పష్టం చేశారు. ఐదేళ్లు కార్యకర్తలు పడిన ఇబ్బందులు, కంటి నిండి నిద్రలేని రాత్రులు గడిపిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. మనిషిని హింసిస్తూ ప్రాణంతో బ్రతకాలంటే జైజగన్‌ అనాలని చెబితే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలాడని గుర్తు చేసుకున్నారు.