ఎన్డీయే ప్రభుత్వంలో కీలకం కానున్న చంద్రబాబు, నితీష్

ఎన్డీయే ప్రభుత్వంలో కీలకం కానున్న చంద్రబాబు, నితీష్
సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఆ ఇద్దరు నేతలను ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికల ముందే ఎన్డీయేలో ప్రవేశించారు. వారే బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. సరిగ్గా 8 నెలల క్రితం చంద్రబాబు అవినీతి ఆరోపణలపై రెండు నెలల పాటు జైలుకు వెళ్లారు. కూటముల మార్పిడితో నితీశ్‌ కుమార్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో ఏర్పాటుకానున్న ఎన్డీయే ప్రభుత్వంలో వారిద్దరి పాత్ర కీలకంగా మారనున్నది.
తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రజలు స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి ఇవ్వలేదు. ఇండియా కూటమి 233 సీట్లలో గెలుపొందగా.. ఎన్డీయే కూటమి 293 సీట్లు సాధించింది. 
 
అయితే సొంతంగా 241 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కమలం పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కు 31 స్థానాల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఎన్డీయే కూటమికి మిత్రపక్షాల మద్దతు అనివార్యంగా మారింది. అదే సమయంలో 233 స్థానాల్లో గెలుపొందిన ఇండియా కూటమికి 39 స్థానాలు కావాల్సి ఉండటంతో ఆసక్తికరంగా మారింది. అయితే, బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగనున్న ఎన్డీయే భేటీలో వీరిద్దరూ పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ 16 స్ధానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ మిత్రపక్షం జనసేన రెండు చోట్ల గెలుపొందింది. మరోవైపు బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని జేడీయూ 12 స్థానాల్లో గెలుపొందింది. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత ఈ రెండే పెద్ద పార్టీలు కావడం గమనార్హం. 

బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కకపోవడంతో నితీశ్‌ కుమార్‌, చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది. దానితో వారిద్దరి మద్దతు పొందగలిగితే కేంద్రంలో ప్రభుత్వం తామీ ఏర్పాటు చేయవచ్చనే ఆశలు ఇండియా కూటమి నేతలలో కనిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో తమ వ్యూహం ఏమిటనేది ముందే చెప్పేస్తే ప్రధాని మోదీ జాగ్రత్త పడతారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం ఆకస్తికరంగా మారింది. ఇండియా కూటమిలో చేరే విషయమై ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌లతో చర్చలు జరుపుతున్నట్టు  శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పాత మిత్రపక్షాలు జేడీయూ, టీడీపీతో చర్చలపై బుధవారం నిర్ణయం తీసుకొంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు.