మూడోసారి ప్రధానిగా మోదీ… మళ్ళీ సంకీర్ణ యుగం

మూడోసారి ప్రధానిగా మోదీ… మళ్ళీ సంకీర్ణ యుగం

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 292 స్థానాల్లో గెలిచింది. దానితో వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.  బీజేపీ 240, తెలుగుదేశం 16, జేడీయూ 12, శివసేన శిందే వర్గం 7, ఎల్జేపీ రామ్‌విలాస్ పాశ్వాన్‌ వర్గం 5, జనసేన 2, జేడీఎస్‌ 2, ఆరెల్డీ 2 సీట్లలో విజయం సాధించాయి. 

ప్రతిపక్ష ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 99, సమాజ్‌వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్‌ 29, డీఎంకే 22, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 9, ఎన్సీపీ శరద్‌పవార్ వర్గం 7, ఆర్జేడీకి 4, సీపీఎం 4, ఆమ్‌ ఆద్మీ పార్టీ 4 స్థానాలు గెలిచాయి.  లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైనప్పటికీ ప్రతిపక్ష కూటమికి ఎన్డీయేకు మధ్య సీట్ల సంఖ్యలో అంతరం తక్కువగానే ఉంది.

మూడోసారి మోదీ సర్కార్ కొలువు దీరడానికి మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడాల్సి ఉంది. పదేళ్ల తర్వాత బలమైన ప్రతిపక్షం ఏర్పాటయింది.  దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ జరిగింది. 80 స్థానాలు మావే అనుకుంటే ప్రతిపక్ష కూటమి అంత తేలిగ్గా వదల్లేదు. బీజేపీ 37 చోట్లే గెలవగా ఇండియా కూటమి 42 స్థానాలను కైవసం చేసుకుంది. 

48 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి అనుకున్న రీతిలో ప్రజల మద్దతు కూడగట్టలేకపోయింది. శివసేన, ఎన్సీపీ చీలిక పార్టీలతో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ కూటమి కంటే శివసేన ఉద్దవ్ వర్గం, శరద్‌ పవార్ ఎన్సీపీ పార్టీతో కలిసి కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన మహావికాస్ అఘాడీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రలో ఎన్​డీఏ 17, ఇండియా కూటమి 30 చోట్ల గెలిచాయి.

రాజస్థాన్‌లోనూ బీజేపీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. ఇటీవలే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కమలదళం 25 లోక్‌సభ స్థానాలకుగాను 14 చోట్లే గెలిచింది. 10 చోట్ల ఇండియా కూటమి గెలిచి పట్టు నిలుపుకుంది. 

బంగాల్‌లో తృణమూల్‌ను గట్టి దెబ్బకొట్టాలని భావించిన కమలదళం ఎన్నికల్లో గట్టి అభ్యర్థులనే నిలిపింది. మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమాను కనబరిచింది. కానీ అధికార టీఎంసీ బీజేపీని గట్టిగానే నిలువరించింది. 29 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 12 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక చోట విజయం సాధించింది. గతంలో సత్తాచాటని దక్షిణాదిలోనూ ఈసారి మెరుగైన స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తంచేసిన బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

తమిళనాట బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. తమిళనాడులో 39కి ఇండియా కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది. కేరళలో మాత్రం బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. ఇండియా కూటమి 18 సీట్లలో విజయం సాధించింది. ఇతరులు ఒక చోట గెలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్​డీయే మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. 

ఒడిశాలో అనుకున్న ఫలితాలు రాబట్టడంలో బీజేపీ సఫలమైంది. ఒడిశాలో 78 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 21 లోక్‌సభ స్థానాల్లో 19 చోట్ల ఆధిక్యంలో నిలిచి అధికార బీజేడీని బీజేపీ పెద్ద దెబ్బకొట్టింది. లోక్‌సభలో 543 స్థానాలు ఉండగా సూరత్‌ లోక్‌సభ స్థానం బిజెపికి ఏకగ్రీవమైంది. ఫలితంగా 542లోక్‌సభ స్థానాలకే పోలింగ్ నిర్వహించారు.